Wednesday, March 26, 2025
HomeNewsTelanganaHome Guard Ravinder:హోంగార్డు రవీందర్ మృతి

Home Guard Ravinder:హోంగార్డు రవీందర్ మృతి

Home Guard Ravinder: నాలుగు రోజుల క్రితం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ట్రాఫిక్ హోంగార్డు రవీందర్(38) తుది శ్వాస విడిచాడు. అపోలో డీఆర్డీవో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. రెండు నెలలుగా సమయానికి వేతనాలు అందకపోవడంతో హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాలయంలో సెప్టెంబర్ 5వ తేదీన పెట్రోల్ పోసుకుని హోంగార్డు రవీందర్ ఆత్మహత్యాయత్నం చేశారు. అంతకు ముందు జీతాల గురించి హోంగార్డుల కార్యాలయ ఉద్యోగులతో రవీందర్ మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. వేతనాలు ఎప్పుడు చెల్లిస్తారని అడిగిన రవీందర్‌ను చెక్కులు క్లియరెన్స్ అవ్వాలని ఉద్యోగి బదులిచ్చారు. రెండు నెలలుగా జీతాలు లేవని రవీందర్ చెప్పడంతో, అయితే ఆ విషయాన్ని సిఎం కేసీఆర్‌ను అడగాలని పోలీస్ అధికారి బదులిచ్చాడు. దీంతో రవీందర్ తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని కమాండెంట్ కార్యాలయంలోకి పరుగులు తీశాడు. హైదరాబాద్‌లో హోంగార్డ్స్ కమాండెంట్‌ కార్యాలయంలో ఈ ఘటన మూడ్రోజుల క్రితం కలకలం రేపింది.

రవీందర్ కు తన ఈఎంఐ చెల్లింపు తేదీ వచ్చినా జీతం అందకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యడు. రెండు నెలలుగా జీతాలు లేకపోవడం ఆర్థికంగా అతను సతమతం అవుతున్నాడు. జీతాల చెల్లింపులో జాప్యానికి నిరసనగా కమాండెంట్‌ కార్యాలయంలోనే నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని షాయినాయత్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో మంగళవారం రోజు జరిగింది. రవీందర్ చాంద్రాయణ గుట్ట ట్రాఫిక్‌ పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పని చేస్తున్నారు. ఆయన పాత బస్తీ ఉప్పుగూడలో భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు.

రవీందర్ లోన్ కు సంబంధించిన ఈఎంఐ చెల్లింపునకు ప్రతి నెల 5వ తేదీన గడువు పెట్టుకున్నారు. ఈ నెలలో ఇంకా జీతం రాక పోవడంతో, నేరుగా గోషామహల్‌లోని హోంగార్డు కమాండెంట్‌ కార్యాలయానికి వెళ్లి మంగళవారం రోజున అక్కడ విచారించాడు. అక్కడ డ్యూటీలో ఉన్న ఉద్యోగులు హోంగార్డుల జీతాలకు సంబంధించిన చెక్కులను బ్యాంకులకు పంపామని.. ఆ చెక్కులు ఒకట్రెండు రోజులలో ‌ఖాతాలకు జమ అవుతాయని చెప్పారు. ఈ క్రమంలోనే వేతనాల చెల్లింపు గురించి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో రవీందర్ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. వెంటనే ఆఫీసు బయటకు వెళ్లి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు.

శరీరమంతా మంటలు వ్యాపించడంతో గట్టిగా కేకలు వేస్తూ హోంగార్డ్స్‌ ఆఫీసులోకి పరిగెత్తాడు. ఈ పరిణామంతో సిబ్బంది షాక్ గు గురయ్యారు. వారు వెంటనే తేరుకొని మంటలార్పే ప్రయత్నం చేశారు. అప్పటికే రవీందర్‌కు సగానికి పైగా శరీరంపై గాయాలయ్యాయి. ఆయనను చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం అక్కడి నుండి కంచన్‌భాగ్‌లోని డిఆర్‌డీవో అపోలో ఆసుపత్రికి తరలించారు. రవీందర్ చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

రవీందర్ ఆత్మహత్యాయత్నం చేయడంతో ప్రభుత్వం హడావుడిగా బుధవారం రోజున హోంగార్డుల వేతనాలను చెల్లించింది. అయితే, హోంగార్డులు విధులు బహిష్కరించి ఆందోళనకు సిద్ధం అయ్యే క్రమంలో వారిని బుజ్జగించారు. రవీందర్ మరణించడంతో ఉస్మానియా వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments