బీజేపీ 8 సీట్లలో గెలిచేలా మరో 8 సీట్లలో కాంగ్రెస్ గెలిచేలా బీజేపీ – కాంగ్రెస్ మద్య ఒప్పందం కుదిరిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సమైక్యవాదులు కోరుకుంటున్నారని అన్నారు. రేవంత్ రెడ్డికి ఆంధ్రా మూలాలున్నాయని.. తెలంగాణ ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోడానికి బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం వస్తుందన్నారు. రివర్స్ గేర్లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు.
రాష్ట్రం దివాలా తీసిందని ముఖ్యమంత్రే చెబితే పెట్టుబులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రేవంత్ మాటల వల్ల తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో రియిల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందని తెలిపారు. పారిశ్రామికవేత్తలు ఈ ప్రభుత్వం హయాంలో ఇబ్బందుల పడుతున్నారని అన్నారు. ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతారని అర్వింద్, మహేశ్వర్ రెడ్డి అంటున్నారని… దీన్ని రేవంత్ ఎందుకు ఖండించడం లేదని దుయ్యబట్టారు. రేవంత్ మైనారిటీలను మోసం చేస్తున్నారని, అందుకే కేబినెట్లో మైనారిటీని తీసుకోలేదని విమర్శించారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం బీఆర్ఎస్ తోనే సాధ్యం అని హరీష్ రావు అన్నారు.