తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్యశాలి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2022 నుండి తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రజా పాలన లో కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. సమీక్షా సమావేశంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ,రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన రజక నేతలు పాల్గొన్నారు.
చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు, వర్ధంతి కార్యక్రమం కోసం బీసీ సంక్షేమ శాఖ 15 లక్షల రూపాయలు కేటాయించింది. అందులో ఈనెల 26 న రవీంద్ర భారతిలో జరిగే జయంతి కార్యక్రమాల కోసం 12 లక్షల రూపాయలు కేటాయించగా, 10 వ తేది జరిగే వర్ధంతి కార్యక్రమం కోసం 3 లక్షలు కేటాయించారు.
ఉత్సవాల కోసం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చైర్మన్ గా 40 మందితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. పాలకుర్తి లో చాకలి ఐలమ్మ స్మారక భవన నిర్మాణానికి ఉన్న అనువైన స్థలాలను అధికారులతో పరిశీలించాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కి సూచించారు. ఇప్పటికే ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహ రోడ్డు పనుల నేపథ్యంలో తొలగించిన గద్దె నిర్మాణం ఇతర ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు..
ఈ నెల 26 వ తేదీన ప్రభుత్వం తరుపున రవీంద్ర భారతిలో అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు జరుపుకోవడంతో పాటు భూమి కోసం, భుక్తి కోసం,విముక్తి కోసం ఆమె త్యాగం గ్రామగ్రామాన తెలిసేలా అన్ని గ్రామాల్లో ఉత్సవాలు జరపాలని కమిటీ సభ్యులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.