కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల రాష్ట్ర రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో విపలమైన ప్రభుత్వం, పండించిన వడ్లను సైతం సకాలంలో కొనుగోలు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తున్నరని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిద్రాహారాలు మాని పడిగాపులు కాస్తున్నారని, వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ ముందస్తు సమాచారమిచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రం కల్లాల వద్ద వడ్ల కొనుగోలును వేగవంతం చేయకపోవడం, వడ్లు తడవకుండా కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దుర్మార్గమని అన్నారు. తాలు, తరుగు, తేమ పేరుతో క్వింటాలుకు 5 నుండి 10 కిలోలు కోత పెడుతూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని, ఇచ్చిన హామి ప్రకారం కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా క్వింటాలుకు రూ.200 నుండి రూ.500 ల వరకు రైతులు నష్టపోతున్నారని బండి సంజయ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే, సీఎం ఆదేశాలు ప్రకటనలకే పరిమితమయ్యాయని తెలిసిపోయిందని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఒక్కో ఎకరాకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు చెల్లిస్తామని హమీ ఇచ్చిందని అన్నారు. అధికారంలోకి వచ్చి సుమారు 6 నెలలైనా రైతు భరోసా కింద రైతుకు సాయం, రూ.2 లక్షల రుణమాఫీ కాలేదని మండిపడ్డారు. పండించిన పంటకు డబ్బులు రాక, ప్రభుత్వం నుండి సాయం అందక, చేసిన అప్పులు తీరక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. దీనికితోడు వానాకాలం సీజన్ ప్రారంభం కాబోతోందని, వ్యవసాయానికి పెట్టుబడి లేక, బ్యాంకుల నుండి కొత్త అప్పులు పుట్టక రైతులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని అన్నారు. ఈ తరుణంలో రేపు(సోమవారం) జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడంతోపాటు వారికి ఉపశమనం కలిగేలా నిర్ణయాలు తీసుకుని యుద్ద ప్రాతిపదికన వాటిని అమలు చేయాలన్నారు. ముఖ్యంగా రాబోయే నాలుగైదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో కల్లాల వద్ద ఉన్న వడ్లను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేలా అధికారులకు ఆదేశాలిచ్చి రైతులను ఆదుకోవాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేశారు.