భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనీ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని. ఎక్కడ ఇబ్బంది ఉన్న వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ఉదయం నుండి కరీంనగర్ కార్యాలయం నుండి జీహెచ్ఎంసీ,సిద్దిపేట , కరీంనగర్ , హనుమకొండ ,సిరిసిల్ల జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జిల్లా అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ అప్రమత్తం చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయం నుండి సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి, జిల్లా పోలీస్ కమిషనర్, ఇతర అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాలు కురిసినందున అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సిద్దిపేట – హనుమకొండ వెళ్ళే రోడ్డు పై భారీగా వరద నీరు పోతుండటంతో అక్కడ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దాంతో పాటు అటువైపు ఎవరు వెళ్లకుండా భారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వరదల్లో రోడ్డుపై ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం రామచంద్రాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బొబ్బల కనుక రెడ్డి వరద కాలువ కెనాల్ ప్రవాహంలో గల్లంతు అయ్యారు. ఆవు కోసం వెళ్లి కనకారెడ్డి గల్లంతు అయ్యారనీ రైతు కనకారెడ్డి ఆచూకీ కోసం తక్షణమే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.రైతులు జాగ్రత్తగా ఉండాలనీ. వర్షాలు తగ్గిన తరువాత నే పొలం దగ్గరకు వెళ్ళాలి.నీళ్ళు ఉన్న వైపు వెళ్ళరాదు. వరదల్లో ఎవరు చేపలు పట్టడానికి వెళ్ళరాదనీ తెలిపారు.
హైదరాబాద్ ఇంచార్జి మంత్రి గా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి,సీపీ శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదిప్ దురశెట్టి లతో ఎప్పటికప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో తాజా పరిస్థితి పై ఆరా తీశారు. జంట జలాశయాలు హిమాయత్ సాగర్,ఉస్మాన్ సాగర్ లలో తాజా పరిస్థితి పై అడిగి తెలుసుకున్నారు. నగరంలో 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద మోటార్లు పెట్టీ నీటిని పంపించాలని ఆదేశించారు. నగర ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రాకూడదని సూచించారు.లోతట్టు ప్రాంతాల్లో ముంపుకు గురయ్యే ప్రజలను సరక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. నగరంలో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం లేదని మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. కంట్రోల్ రూం ద్వారా ప్రజల పిర్యాదులు వస్తె వెంటనే రెస్పాండ్ కావాలన్నారు. పురాతన శిధిలావస్థలో ఉన్న భవనాలు ఉంటే వాటిని గుర్తించి అక్కడి నుండి పంపించివేయాలన్నారు. విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయన్న సమాచారం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇక కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రాజెక్ట్ లో నీటి వివరాలు జిల్లాలో తాజా పరిస్థితి పై అడిగి తెలుసుకున్నారు. ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ , మేడిపల్లి సత్యం లతో కలిసి స్వయంగా లోయర్ మానేర్ డ్యాం పరిశీలించారు. జిల్లాలో వరద పరిస్థితి పై ఆరా తీశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ,ఎస్పీ అఖిలేష్ మహజన్ ఇతర అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించారు. మిడ్ మానేరు కు వస్తున్న వరద అప్పర్ మానేరు డ్యాం లో తాజా పరిస్థితి పై ఆరా తీశారు. జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అధికారులంతా క్షేత్ర స్థాయిలో ఉండాలన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ఇతర అధికారులతో ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిపై సమీక్షించారు. జిల్లాలో భారీ వర్షాలు కురిసినా నేపథ్యంలో రోడ్డు పై భారీగా వెళ్తున్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరు బయటకు రాకూడదని సూచించారు.