భారీ వర్షాలు, ఇతర విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొని పౌరులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు హైదరాబాద్ ఓ.ఆర్.ఆర్ పరిది వరకు జీహెచ్ ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలను విస్తరించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియచేసారు. హైదరాబాద్ నగరం తోపాటు ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు ఆకస్మిక వర్షాలు, వరదలు వచ్చినా ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు రాకుండా తగు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్బంగా సచివాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశాంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జీహెచ్ఎంసీ ఇంచార్జ్ కమీషనర్ ఆమ్రపాలి, జీహెచ్ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, జీహెచ్ ఎంసీ లోని డిజాస్టర్ రెస్పాన్స్ విభాగాన్ని మరింత పటిష్ఠ పరుస్తున్నామని, ఇందుకుగాను విపత్తులను ఎదుర్కోవడానికి అదనపు సిబ్బందిని, తగు యంత్ర పరికరాలను అందచేయనున్నామని వివరించారు. ఇప్పటికే, జీహెచ్ ఎంసీ పరిధిలో 30 డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయని, వీటికి తోడు మరో 15 బృందాలను అదనంగా ఏర్పాటు చేసి వీటి సేవలను ఓ ఆర్ ఆర్ వరకు విస్తరించనున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలో పెద్ద సంఖ్యలో ఫార్మా కంపెనీలున్నందున, కెమికల్ ఫైర్ ప్రివెన్షన్ కు ప్రత్యేక శిక్షణ తోకూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని శాంతి కుమారి సూచించారు. కాగా, హైదరాబాద్ నగరంలో 141 సమస్యాత్మక ప్రాంతాలలో మున్సిపల్, పోలీస్, విధ్యుత్, జలమండలి తదితర సంబంధిత శాఖల సమన్వయంతో పౌరులకు ఏవిధమైన ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు చేపట్టాలని సి.ఎస్ పేర్కొన్నారు. హైదరాబాద్ తోపాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర నగరాలలో కూడా డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఉన్న డీఆర్ఎఫ్ బృందాలను పటిష్ట పర్చడం చేయాలని ఆదేశించారు. విపత్తులు వచ్చినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ విభాగంతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దేశంలోని ప్రధాన మహానగరాలైన ముంబయి, ఢిల్లీ , చెన్నై, బెంగుళూరు లలో డిజాస్టర్ రెస్పాన్స్ బృందాల పనితీరు పైకూడా అధ్యయనం చేయాలని ఆదేశించారు