“అన్నిరకాల వసతులు ఉన్న హైదరాబాదులో పరిశ్రమలు స్థాపించండి ప్రభుత్వ పక్షాన సంపూర్ణ సహకారం అందిస్తామని” బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారెట్ విన్ ఓవెన్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కోరారు. గురువారం ఉదయం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎంతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యా రెట్, బ్రిటిష్ హై కమిషన్ పొలిటికల్ ఎకానమీ అడ్వైజర్ నలిని రఘురామన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు మధ్య మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ, అర్బన్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ పరిశ్రమలు స్థాపించడానికి హైదరాబాద్ స్వర్గధామం లాంటిది అని వివరించారు. అందరికీ అనుకూలమైన వాతావరణం, తక్కువ ధరలో మానవ వనరులు, నిరంతరాయం నాణ్యమైన విద్యుత్ సరఫరా , తాగునీటి కొరత లేని పరిస్థితి వంటి సదుపాయాలను వివరించారు. వీటికి తోడు రీజనల్ రింగ్ రోడ్డు, మూసి పరివాహక ప్రాంత అభివృద్ధి కి జరుగుతున్న కార్యాచరణను వివరించారు.