ఈ ఏడాది ఎప్రిల్ నెలలో కొత్త పార్టీని తీన్మార్ మల్లన్న ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద మల్లన్న రిష్టర్ చేసుకున్నారు. అయితే అందులో భాగంగానే పార్టీ పేరును రిజిష్టర్ చేసే క్రమంలో ఈసీ కీలక అప్డేట్ ఇచ్చింది. తీన్మార్ మల్లన్న రిజిష్టర్ చేసుకున్న పార్టీ పేరుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 20 లోపు ఫిర్యాదులు, అభ్యంతరాలు చేయవచ్చని ఈసీ తన వెబ్ సైట్ లో తెలిపింది. తెలంగాణ నిర్మాణ పార్టీ ప్రధాన కార్యదర్శగా రజనీ కుమార్ (ధర్మసాగర్ , వరంగల్ జిల్లా) ను, పార్టీ కోశాధికారిగా ఆర్.భావన ( సరూర్ నగర్, హైదరాబాద్ ) లను పార్టీ ధరఖాస్తులో తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నవేళ మల్లన్న పార్టీ ఎన్నికల్లో ఏమేరకు ప్రభావం చూపిస్తుందని అప్పుడే చర్చ మొదలైంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ 115 మంది అభ్యర్థులను ప్రకటించింది. తాము చేసిన సంక్షేమ, అభివృద్ది పథకాలే తమను మరోసారి గెలిపిస్తాయని అధికార పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. మరోవైపు.. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు మల్లన్న కొత్త పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తుందో తెలియాలంటే ఎన్నికల వరకు ఎదురు చూడవలసిందే.