తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఎవరున్నారు ? కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కేంద్ర మంత్రులుగా వెళ్లడంతో అధ్యక్ష బాధ్యతలను హై కమాండ్ ఎవరికి అప్పగిస్తుంది? అనే ప్రశ్నలు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు దీనిపైనే ఢిల్లీ నుండి గల్లీ దాక చర్చనీయాంశంగా మారింది. 2019తో పోలిస్తే కాషాయ దళం తెలంగాణలో బాగా బయల్పడింది. సార్వత్రిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి.. ఏకంగా 8 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో ఈసారి కేంద్ర మంత్రి వర్గంలో తెలంగాణ నుండి ఇద్దరికీ ఛాన్స్ లభించింది. కిషన్ రెడ్డికి కేబినెట్ బెర్త్ ధక్కగా.. సహాయ మంత్రి పదవి బండి సంజయ్ ని వరించింది.
ఈటెల రాజేందర్, డీకే అరుణ పేర్లు కేంద్ర మంత్రి పదవుల విషయంలో చర్చకు వచ్చినా.. మొదటి నుంచీ పార్టీతోనే ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను మోడీ ఎంపిక చేసుకున్నారు. పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. కిషన్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రి కావడంతో.. ఆయన వారసునిగా పార్టీ అధ్యక్షునిగా ఎవరిని ఎంపిక చేస్తారోనని పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. గత ఏడాది జూన్ లో రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. అధ్యక్ష పదవితో పాటు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. అయితే, బీజేపీ సిద్ధాంతాల ప్రకారం ఒక వ్యక్తికి రెండు పదవులు ఉండకూడదు. పార్టీ పదవితో పాటు మంత్రి పదవిలో ఉండటానికి ఆస్కారం ఉండదు. దీంతో కొత్త అధ్యక్షుని ఎంపిక తప్పనిసరి అని తెలుస్తోంది. దీనికితోడు కిషన్ రెడ్డి కూడా అధ్యక్ష మార్పు ఉంటుందనే సంకేతాలు ఇస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా చాలా రాష్ట్రాలలో అధ్యక్షులను extension ఇచ్చి కొనసాగించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో.. జాతీయ అధ్యక్షుడిని కూడా మారుస్తారని తెలుస్తోంది. అయితే జాతీయ అధ్యక్షుడి మార్పు తర్వాత రాష్ట్ర అధ్యక్ష మార్పు ఉంటుందా.. లేదా తరువాత ఉంటుందా అని చర్చ నడుస్తోంది.
తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా పటిష్ఠం చేయడం, గ్రామ స్థాయి నుండి జిల్లా, రాష్ర్ట స్థాయి కమిటీలపై దృష్టి సారించాలని బీజేపీ చూస్తోంది. అందులో భాగంగానే అధ్యక్షుడిని వీలయినంత తొందరగా నియమిస్తారని పార్టీలో చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించిందని.. ఇక రాబోయే రోజుల్లో బీజేపీ బలమైన శక్తిగా ఎదగుతుందని బీజేపీ భావిస్తుంది. ఇక, కొత్త అధ్యక్ష పదవి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీ ఎంపీలలో ఒకరికి అవకాశం ఇస్తారా ? ఎమ్మెల్యేలో ఒకరికి అవకాశం కల్పిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్ కే ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే, ఈటెల కూడా ఆ పదవిపై ఆసక్తితో ఉన్నాడని అంటున్నారు. ఆయనకి అధ్యక్ష పదవి ఇస్తే బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి కీలక నేతల వలసలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.