ప్రపంచ ధరిత్రి దినోత్సవం (ఏప్రిల్ 22) సందర్భంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సందేశం
మనుషుల మితిమీరిన అవసరాలతో, అత్యాశతో, అనాలోచిత చర్యలతో నేలతల్లి జీవాన్ని కోల్పోతున్నది. నీటి వనరులు కలుషితమవుతున్నాయి. పీల్చే గాలి విషతుల్యమవుతున్నది. అరుదైన జీవజాతులు నశిస్తున్నాయి. పక్షులు కనుమరుగు అవుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అకాల వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయి. సముద్ర నీటిమట్టం ప్రమాదకరంగా పెరుగుతూ మనుషుల ఉనికికి ప్రమాదం వాటిల్లుతున్నది. తాగునీటి లభ్యత తగ్గి జనం అవస్తలు పడుతున్నారు. ప్రకృతి సమతుల్యత, జీవ సమతుల్యత లోపించి పడరాని పాట్లు పడుతున్నాం. ఇవన్నీ ఒక వైపైతే మరోవైపు ప్లాస్టిక్ ఈ నేలతల్లికి ఎంతటి హానిచేస్తున్నదనే విషయం ప్రజలందరికీ ఎరుకలో ఉన్నదే. ప్లాస్టిక్ కలిగించే అనర్థాలతో ఈ పుడమి ఉనికి ప్రమాదంలో పడింది. ప్లాస్టిక్ కలిగిస్తున్న దుష్పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఐక్యరాజ్య సమితి ఈ యేడు ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ‘ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ (ప్లాస్టిక్ మీద భూగ్రహ సమరం)’ పిలుపునిచ్చింది. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించడంతో పాటు, 2040 నాటికి ప్లాస్టిక్ ఉత్పత్తిని 60 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ రహిత జీవనశైలిని అలవర్చుకోవాలి. ఐక్యరాజ్యసమితి సూచనలను ప్రతి ఒక్కరు తప్పక ఆచరించాలి.
మనుషులు ఈ భూగ్రహం కేవలం తమ అవసరాలకు మాత్రమే అనే అత్యాశకరమైన స్థితి నుండి బయటకు రావాలి. సకల జీవరాసులకు ఈ భూమి పై సమాన హక్కులున్నాయి. ప్రకృతికి ఏ హానీ తలపెట్టకుండా ఉంటే చాలు, దానికి మనం ప్రత్యేకంగా మేలు చేయాల్సిన అవసరంలేదనే నిజాన్ని మనుషులు తెలుసుకోవాలి. ఈ సృష్టిలో భూమి మాత్రమే మనుషులకు నివాసయోగ్యమైనందున, భవిష్యత్ తరాల కోసం ఈ నేలతల్లిని సంరక్షించుకోవల్సిన బాధ్యత మనందరిది. ఈ దిశగా పుడమికి మేలు చేసే దిశగా మన జీవనశైలిని, అలవాట్లను మార్చుకోల్సిన అవసరం ఉన్నది. పుడమిని కాపాడుకుంటేనే, మనల్ని మనం కాపాడుకోగలమని, అప్పుడే మనకు మనుగడ ఉంటుందనే సత్యాన్ని గ్రహించాలి. ప్రకృతి ప్రళయ రూపం ధరించకముందే మనమంతా తేరుకోవాలి. ప్రజలంతా నేలతల్లి సంరక్షణకు ఉద్యుక్తులు కావాలి.