తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కృష్ణా నది జలాల విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని కవిత హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ను విమర్శించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా పాత పద్ధతులనే కొనసాగిస్తోందని ఆమె ధ్వజమెత్తారు.

ఎస్ఎల్‌బీసీ, నక్కలగండి, డిండి ప్రాజెక్ట్‌లను ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు. సుంకిశాల ప్రమాదంపై కాంట్రాక్ట్ సంస్థ మేఘాపై చర్యలు తీసుకోకపోవడాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు ఆ సంస్థతో ‘ఫెవికాల్ బంధం’ ఏమిటని విమర్శించారు. నిర్వాసితులకు 17 ఏళ్లయినా భూమి, ఉద్యోగం లేని దయనీయ పరిస్థితిని ప్రస్తావిస్తూ, కృష్ణా నీళ్లు తేవడంలో అలసత్వం వహిస్తే సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి, తన కార్యక్రమాల కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తమ కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేయించారని, ‘జాగృతితో పెట్టుకున్నోళ్లు ఎవరు బాగుపడలేదు’ అని హెచ్చరించారు.

నల్గొండ చారిత్రక వైభవాన్ని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాత్రను గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడి బౌద్ధ, జైన స్థూపాలను గుంటూరుకు తరలించిన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ వచ్చాక కూడా అవి తిరిగి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిపై మాట్లాడుతూ.. ఒక్కో బెడ్‌పై ఇద్దరు పేషెంట్లు, పిల్లలను పడుకోబెట్టడం దారుణమన్నారు. పీడియాట్రిక్ విభాగంలో ఎంఆర్‌ఐ లేక బిడ్డలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతమని తెలిపారు. డాక్టర్లు, నర్సుల ఓపికకు నమస్కరించిన ఆమె, సౌకర్యాలు కల్పించడంలో రాజకీయ నాయకులుగా విఫలమయ్యామని అన్నారు. ప్రసవ వేదన తగ్గించే ‘ఎపిడ్యూరెల్’ మందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేకపోవడంపై మహిళలకు క్షమాపణ చెప్పారు. ఈ విషయంలో మార్పు తేవాలని ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహాను కోరారు.
Also Read..| జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 48.47% ఓటింగ్.. ఫలితాలపై ఉత్కంఠ
జిల్లాలోని పత్తి, ధాన్యం కొనుగోలు సమస్యలపై ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు. లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడం, క్వింటాళ్ల కొనుగోలుకు పరిమితి విధించడం, బోనస్ తప్పించుకునేందుకే కొనుగోలులో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ మంత్రి, కేంద్ర మంత్రికి లేఖ రాశామని తెలిపారు.నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో భౌగోళిక తెలంగాణ సాధించామని, కానీ ఇంకా అవకాశలు, అధికారం, ఆత్మగౌరవం దక్కని పేదలకు, మహిళలకు, బీసీలకు, మైనార్టీలకు న్యాయం జరగాలన్నారు. స్థానిక సంస్థల్లోనే కాక, చట్టసభల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత మంత్రులను సీఎం వివక్షతో కింద కూర్చోబెట్టిన యాదాద్రి ఘటనను ప్రస్తావిస్తూ, కుల వివక్ష లేని సమాజం రావాలని ఆకాంక్షించారు. ఈ ‘జనం బాట’ కేవలం రాజకీయాలు చేయడానికి కాదని, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడమే తమ లక్ష్యమని కవిత స్పష్టం చేశారు.









