బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల మధిర లో నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అర్ధాంతరంగా కరీంనగర్ పర్యటనను రద్దు చేసుకొని హుటాహటీన అర్ధరాత్రి మధిరకు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మధిర మండలం వంగవీడు గ్రామానికి చెందిన మత్స్యకార సభ్యుడు తోటపల్లి వెంకటేశ్వర్లు వలను తొలగించేందుకు బుగ్గ వాగు లోకి వెళ్లి చిక్కుకున్నాడు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్, ఖమ్మం పోలీస్ కమిషనర్ ను, అప్రమత్తం చేశారు. బుగ్గ వాగు మధ్యలో చిక్కుకున్న వెంకటేశ్వర్లు బయటకు తీసుకురావడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, సూచనలు ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశిస్తూ పర్యవేక్షించారు.అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బుగ్గ వాగు వద్దకు చేరుకున్న డిప్యూటీ సీఎం జిల్లా కలెక్టర్ ఖమ్మం పోలీస్ కమిషనర్ తో పరిస్థితిని సమీక్షించారు.
కలెక్టర్, సిపితో పరిస్థితిని సమీక్షించిన డిప్యూటీ సీఎం
మంచిర్యాల జిల్లా చెన్నూరు వెళ్లవలసిన పర్యటనను అర్ధాంతరంగా వాయిదా వేసుకుని హుటాహటీన మధిరకు పయనమైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మార్గ మధ్యలోనే ఖమ్మం కలెక్టర్, ఖమ్మం పోలీస్ కమిషనర్, ఖమ్మం కార్పొరేషన్, మధిర రెవిన్యూ, మునిసిపల్ అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించి వారికి పలు సూచనలు చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధికారులు అలెర్ట్ గా ఉండాలని ఆదేశించారు. వాగులు, వంకలు నదులు పొంగుతున్న నేపథ్యంలో ప్రజలకు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను క్యాంపులకు తరలించాలని.. అక్కడ వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.
అర్ధరాత్రి రెండు గంటలకు బుగ్గ వీటి వాగు కు చేరుకున్న డిప్యూటీ సీఎం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం లోనే కరీంనగర్ నుంచి వరంగల్, తొర్రూరు, ఖమ్మం మీదుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర మండలం వంగవీటి గ్రామాంలోని బుగ్గ వాగుకు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో చేరుకొని వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు. అప్పటికే అధికారులు వెంకటేశ్వర్లను వాగు మధ్యలో నుండి బయటకు తీసుకురావడానికి వివిధ మార్గాల్లో సహాయక చర్యలు చేపట్టారు. డ్రోన్ సహాయంతో తాడును పంపించేందుకు ప్రయత్నం చేశారు. చిమ్మని చీకటి తో పాటు కురుస్తున్న భారీ వర్షంతో ఆ ప్రయత్నం విఫలం కావడంతో గజ ఈత గాళ్లను పిలిపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యవేక్షణలో అధికారులు గజ ఈతగాళ్లు సహాయంతో అర్ధరాత్రి రక్షించారు. గంటల పాటు ప్రయాసపడి వాగు మధ్యలో నుంచి అతి కష్టం మీద బయటకు తీసుకువచ్చి వెంకటేశ్వర్లు ప్రాణాలను కాపాడిన గజ ఈత గాళ్లను మరియు అధికార యంత్రాంగాన్ని డిప్యూటీ సీఎం అభినందించారు. వెంకటేశ్వర్లను రక్షించినందుకు గాను ఆయన కుటుంబ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు రెండు చేతులెత్తి దండం పెట్టి రుణపడి ఉంటామన్నారు.
అర్ధరాత్రి పునరావాస కేంద్రం పరిశీలన
లోతట్టు ప్రాంతాల ప్రజలను మధిర 100 పడకల ఆసుపత్రిలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయగా అర్ధరాత్రి కేంద్రానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేరుకున్నారు. పునరావస కేంద్రంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వాన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. పునరావస కేంద్రంలో ఉన్న వారికి ఆహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు
యుద్ధ పాతిపదికన విద్యుత్ పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మధిర నియోజకవర్గంలో ఏర్పడిన విద్యుత్ అంతరాయంపై ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డితో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షించారు. మధిర పట్టణంలోని విద్యుత్తు సబ్ స్టేషన్ లోకి వరద నీరు ప్రవేశించడంతో అందులోనే రెండు ట్రాన్స్ఫార్మర్ లు కొంత మేర నీటిలో మునిగాయని,. సబ్ స్టేషన్ పరిధిలోనే ఉన్న 11 ఫీడర్ లకు అంతరాయం వాటిల్లిందని, ఇందులో రెండు ఫీడర్లు గ్రామీణ ప్రాంతానికి చెందినవని, పట్టణ ప్లీడర్లకు ప్రత్యామ్నాయ ఫీడర్ ద్వారా విద్యుత్తును పునరుద్దించామని వివరించారు. మధిర, ఎర్రుపాలెం బోనకల్లు మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా విద్యుత్ శాఖ సిబ్బంది భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా శ్రమించి అన్ని గ్రామాలకు యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా చేశారని వివరించారు.