తెలంగాణ సాహితీయోధుడు దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి(జూలై 22)ని పురస్కరించుకుని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండా సురేఖ సాహితీ రంగానికి దాశరథి అందించిన సేవలను స్మరించుకున్నారు . దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ సాహితీరంగంలో అక్షర యోధుడని మంత్రి సురేఖ కీర్తించారు. పదునైన అక్షరాలను ఆయుధాలుగా మలిచి అణచివేతకు వ్యతిరేకంగా దాశరథి పూరించిన శంఖారావం తర్వాతి కాలంలో తెలంగాణ సాధన దిశగా యావత్ తెలంగాణను ప్రేరేపించిందని మంత్రి సురేఖ అన్నారు. స్వేచ్ఛ, స్వరాజ్యం కోసం దాశరథి కృష్ణమాచార్యులు అహరహం అంతలా పరితపించారని మంత్రి అన్నారు.
దాశరథి స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ కోసం ఉద్యమించి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నారని అన్నారు. సామాజిక సమస్యలపై అనునిత్యం పోరాటం సాగించిన దాశరథి తరతరాలకు ఆదర్శప్రాయుడని మంత్రి సురేఖ తెలిపారు. దారశరథి ఆశయాల మేరకు కరువు కాటకాలు, అనాథలు, అన్నార్థులు లేని తెలంగాణ సాధనకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తున్నదని మంత్రి సురేఖ తెలిపారు. ఈ యేడు దాశరథి సాహితీ పురస్కారానికి ఎంపికైన మట్టికవి జూకంటి జగన్నాథంకు మంత్రి సురేఖ శుభాకాంక్షలు తెలిపారు.