మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ (76) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డి. శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. పెద్దకుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు. కొద్దిరోజుల క్రితం డీఎస్ ఆరోగ్యం క్షీణించిందని.. ఆయనను ఆసుపత్రిలో చేర్పించామని ఆయన కుమారుడు, ఎంపీ ఆరవింద్ ట్వీట్ కూడా చేశారు. గత కొంతకాలం నుండి డీఎస్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన అంత్యక్రియలు నిజామాబాద్ లో రేపు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన పార్థీవదేహానికి నివాళులు అర్పించారు.