దేశంలో కాంగ్రెస్ వస్తే.. మళ్లీ కర్ఫ్యూలు, మత కలహాలు మొదలవుతాయని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఐక్యత లేని ఇండి కూటమికి అధికారంలోకి వస్తే.. మూడు నెలలకో ప్రధాని మారుతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్ కు కేరాఫ్ అడ్రస్ అని గుర్తు చేశారు. ఈ మేరకు గురువారం ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో జీప్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కూడా కాలేదు. అప్పుడే బ్లాక్ మెయిలింగ్ మొదలైంది. రియల్టర్లు, బిల్డర్లు, కాంట్రాక్టర్లను బెదిరించి రాహుల్ గాంధీ ట్యాక్స్ వసూలు చేస్తూ.. ఢిల్లీకి కోట్ల రూపాయలు పంపుతున్నారు. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని చెప్పారు. ఇదేనా మార్పు?”అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దేశానికి స్థిరమైన ప్రభుత్వం, సమర్థ నాయకత్వం కావాలని, అది నరేంద్ర మోదీ వల్లే సాధ్యమని దేశమంతా విశ్వసిస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీదే అధికారమని, తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో కమలం పార్టీ విజయం సాధించబోతున్నదని ఆయన తెలిపారు.
ఇవి ఢిల్లీ ఎన్నికలు..
ఇవి తెలంగాణ ఎన్నికలో, హైదరాబాద్ ఎన్నికలో కావని, ఢిల్లీ ఎన్నికలని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ‘‘ ఈ ఎన్నికల్లో మీరు అందరూ దేశం కోసం ఓటు వేయాలి.. మన భవిష్యత్ కోసం ఓటు వేయాలి. నీతి, నిజాయితీ కోసం ఓటు వేయాలి. దేశ రక్షణ కోసం ఓటు వేయాలి. బాంబు పేలుళ్లు, మత కలహాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలి. శాంతి కోసం ఓటు వేయాలి. దేశంలో అభివృద్ధి కోసం ఓటు వేయాలి. స్థిరమైన ప్రభుత్వం, సమర్థ నాయకత్వం కోసం ఓటు వేయాలి. మోదీ మన దేశంలో అనేక రకాల సమస్యలకు పరిష్కారం చూపారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడేందుకు 13 కోట్ల టాయిలెట్లు నిర్మించారు. గతంలో పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు హైదరాబాద్ కు వచ్చి బాంబు పేలుళ్లు జరిపి దర్జాగా దేశం దాటి వెళ్లేవారు. ఏకే 47 తుపాకులతో కాల్పులు జరిపేవాళ్లు. లుంబినీ పార్క్, గోకుల్ చాట్, దిల్ షుక్ నగరలో ఉగ్రవాదుల బాంబు పేలుళ్లకు అమాయకులు, చిన్నపిల్లలు చనిపోయారు. మోదీ వచ్చాక ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపారు. గత పదేండ్లలో కర్ఫ్యూలు లేవు, బాంబు పేలుళ్లు లేవు. ఐఎస్ఐ ఖతమైంది. దౌర్జన్యాలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు ఆగిపోయాయి. పాకిస్తాన్ తోక కత్తిరించి, ఆ దేశ నడ్డి విరిచారు. ఆ దేశంలో తినడానికి తిండి లేదు. పాకిస్తాన్ ను ఏకాకి చేసి బిచ్చం ఎత్తుకునే పరిస్థితికి తెచ్చారు మన నరేంద్ర మోదీ. శాంతి కోసం మరోసారి మోదీ గెలవాల్సిన అవసరం ఉన్నది”అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
సికింద్రాబాద్ లో నన్ను ఆశీర్వదించండి
కరోనా విపత్కర సమయంలో ప్రధాని మోదీ దేశంలోని140 కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ అందజేసి ప్రాణాలు కాపాడారని కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘ఇప్పటికీ మోదీ ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. కట్టెల పొయ్యి మీద వంటచేయడం 400 బీడీలు తాగడంతో సమానం. అందుకే మోదీ ఇంటింటికీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందజేశారు. బ్యాంకులంటే.. వ్యాపారులకే అనుకునే పరిస్థితి గతంలో ఉండేది. మోదీ వచ్చాక పేదలందరికీ ఉచితంగా, ఎలాంటి ష్యూరిటీ లేకుండా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఇచ్చారు. దేశ ప్రజలందరికీ మోదీ గ్యారంటీ వహించారు. పేద కుటుంబం నుంచి టీ అమ్మి వచ్చిన.. నాయకుడు నరేంద్ర మోదీ. ఆయనను మరోసారి గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇవిగళ్లీ ఎన్నికలు కావు.. ఢిల్లీ ఎన్నికలు.. ఢిల్లీలో ఉండాల్సిన నాయకుడు నరేంద్ర మోదీ. ఆయనకు ఓటు వేసి గెలిపించండి. సికింద్రాబాద్ నుంచి నన్ను మరోసారి ఆశీర్వదించండి” అని కిషన్ రెడ్డి కోరారు