తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు పలు జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మధ్య మహారాష్ట్ర వద్ద ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని కారణంగా గంటకు 30 నుడి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈదురు గాలుల వల్ల మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని చెప్పారు. ఈ ఏడాది సరైన సమయానికే నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి వస్తాయని స్కైమెట్ అంచనా వేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.