మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్నితెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో రాజీవ్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరణ చేశారు. ఈకార్యక్రమానికి మంత్రలు, ఎమ్మెల్యేలు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, కేకే, వీహెచ్ ఇతర నాయకులు హాజరయ్యారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇది రాజకీయ వేదిక కాదని..ఇక్కడ రాజకీయాలు ప్రస్తావించడం తనకు ఇష్టం లేదని అన్నారు. కానీ కొంతమంది చిల్లరమల్లరగా మాట్లాడేవారికి ఈ వేదికగా కొన్ని విషయాలు గుర్తు చేయదలచుకున్నానని అన్నారు.
అడ్డగోలుగా వేలకోట్లు కూడబెట్టుకున్న వారికి త్యాగం అంటే ఏమిటో తెలియదని అన్నారు. దేశ స్వాతంత్రం కోసం జైల్లో మగ్గిన చరిత్ర పండిట్ జవహర్ లాల్ నెహ్రూది అని రేవంత్ గుర్తుచేశారు. స్వాతంత్య్రం కోసం సర్వం కోల్పోయిన కుటుంబం నెహ్రూ కుటుంబమని అన్నారు. 563 సంస్థానాలను దేశంలో విలీనం చేయించి, దేశ సమగ్రతను కాపాడిన ఘనత నెహ్రూదని కొనియాడారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ ను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని దేశ భవిష్యత్ కు పునాదులు వేసిన ఘనత నెహ్రూదేనని.. నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు సెహ్రూ మనకు అందించిన సంపద అని అన్నారు.
కొంతమంది నాయకులు వారసత్వ రాజకీయల గురించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. నెహ్రూ బ్రతికి ఉండగా ఇందిరా గాంధీ ఏ పదవి తీసుకోలేదని అన్నారు. దేశంలో ఇప్పటికీ ఇందిరాగాంధీని పేద ప్రజలు దేవతలా పూజిస్తున్నారని అన్నారు. బ్యాంకుల జాతీయకరణ చేసి, పేదల అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. రాజభరణాలు రద్దు చేసి ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుందని అన్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాల ఆత్మగౌరవంపెరిగేలా భూములు పంచిపెట్టిన ఘనత ఇందిరమ్మదన్నారు. పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి పేదలకు సొంతింటి కలను నిజాం చేసింది ఇందిరమ్మ కాదా? అని ప్రశ్నించారు. లంబాడాలను ఎస్టీలలో చేర్చింది ఇందిరమ్మ కాదా ? దేశంలో బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ కాదా? దేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు కృషి చేసిన త్యాగశీలి ఇందిరాగాంధీ అని పేర్కొన్నారు.
దేశానికి నాయకత్వ సమస్య వచ్చినపుడు దేశ ప్రజల కోసం రాజీవ్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని సీఎం అన్నారు. దేశ భవిత యువత చేతుల్లో ఉండాలని.. ఓటు హక్కును 21 యేళ్ల వయసు నుండి 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించింది రాజీవ్ గాంధీ కాదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని సవరించి, గ్రామ పంచాయతీలకు నిధులు చేరేలా సంస్కరణలు తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీ అని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చింది, మహిళలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించింది రాజీవ్ గాంధీయేనని అన్నారు.
ఐదేళ్లపాటు మహిళలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వని బీఆర్ఎస్ నాయకులకు మాహిళల ఆత్మ గౌరవం గురించి ఎలా తెలుస్తుందని అన్నారు. దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీయే అని అన్నారు. రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ పరిచయం చేసి ఉండకపోతే, కేటీఆర్ గుంటూరులో ఇడ్లీ, వడ లేదా సిద్దిపేటలో చాయ్ అమ్ముకునే వాడని ఎద్దేవా చేశారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ ను పరిచయం చేయడం వల్లే కేటీఆర్ ఈ స్థాయికి ఎదిగారని అన్నారు.
రాజీవ్ గాంధీ మరణించినా సోనియాగాంధీ ఏ పదవీ తీసుకోలేదని అన్నారు. అవకాశం ఉన్నా 2004 నుంచి 2014 వరకు సోనియా, రాహుల్ ఏ పదవీ తీసుకోలేదని అన్నారు. ప్రాణ త్యాగం అంటే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలది అన్నారు. పదవీ త్యాగం అంటే సోనియా, రాహుల్ గాంధీలదని అన్నారు. తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావుని దేశ ప్రధానిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని తెలిపారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుని, పదవులు పంచుకున్న వాళ్లా.. కుటుంబ పాలన గురించి మాట్లాడేదని బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి ద్వజమెత్తారు.
గడీలలో గడ్డి మొలవాల్సిందేనని ఆనాడు తెలంగాణ సాయుద పోరాటంలో చాకలి ఐలమ్మ చెప్పిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఐలమ్మ స్పూర్తితో.. రాజీవ్ విగ్రహం సాక్షిగా “మీ ఫామ్ హౌస్ లలో జిల్లెళ్ళు మొలవాల్సిందే.. అప్పటి వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరని” తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కట్టుకున్న వారికి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి పదేళ్ల సమయం సరిపోలేదా? అని ప్రశ్నించారు. “మేం రాజీవ్ విగ్రహం పెడతామనాగానే, వారికి తెలంగాణ తల్లి విగ్రహం గుర్తొచ్చిందట” అని అన్నారు.
దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహం ఇక్కడ పెట్టడం సముచితం కాదా? అని తెలంగాణ ప్రజలను అడుగుతున్నాని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామని కొందరు మాట్లాడుతున్నారని.. “ఎవడ్రా తొలగించేది… ఎవడొస్తాడో చూస్తా..” అని బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి ఘాటైన విమర్శలు చేశారు. తెలంగాణ పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసి చూపిస్తామని.. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామని రాష్ట్ర ప్రజలకు సీఎం హామీ ఇచ్చారు.