తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు ప్రపంచ బ్యాంక్ సంసిద్ధతను వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కలిసికట్టుగా రోడ్ మ్యాప్ను రూపొందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ప్రధానంగా స్కిల్ డెవెలప్మెంట్, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, నెట్ జీరో సిటీ, ఆరోగ్య సంరక్షణ, డయాగ్నస్టిక్స్, హెల్త్ ప్రొఫైల్ రంగాల్లో భాగస్వామ్యానికి అవసరమైన సంప్రదింపులు జరిగాయి.
ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ఉన్నతాధికారులు శేషాద్రి, విష్ణు వర్ధన్ రెడ్డి, అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణం, జీవనోపాధి, నైపుణ్యాల వృద్ధి, ఉద్యోగాలు, ఆర్థిక సుస్థిరత తో పాటు వివిధ అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల తమ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలన్నీఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తాము చేపట్టబోయే ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన అమలు చేసి తీరుతామని ప్రకటించారు. అన్నింటిలోనూ అత్యంత పారదర్శకతను పాటిస్తామని స్పష్టం చేశారు. ప్రాంతాల వారీగా చేపట్టే ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, వాటి అమలును వేగవంతం చేసేందుకు వివిధ విభాగాలకు చెందిన నిపుణుల బృందం ఏర్పాటు చేయాలనే ఆలోచనలను ప్రపంచబ్యాంకు బృందంతో పంచుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ అభివృద్ధికి ముఖ్యమంత్రి అనుసరిస్తున్న సమతుల్య దృక్పథం మంచి ఫలితాలను అందిస్తుందని ప్రపంచ బ్యాంకు బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. గతంలో భారత్ లో తమ భాగస్వామ్యంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు సానుకూల ఫలితాలు అందించాయని గుర్తు చేసింది. చర్చల సందర్భంగా నెట్ జీరో సిటీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చూపిన చొరవపై ప్రపంచ బ్యాంకు బృందం మరింత ఆసక్తిని ప్రదర్శించింది.
ప్రజా పాలనతో పాటు రాష్ట్రంలో సమగ్ర సమతుల్య అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును చర్చల్లో పాలుపంచుకున్న ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్ ప్రశంసించారు.
తెలంగాణ రాష్ట్రం ప్రపంచ బ్యాంకు లాంటి అంతర్జాతీయ ద్రవ్యసంస్థలతో కలిసి పని చేయాలని నిశ్చయించటం ఇదే మొదటి సారి. తెలంగాణలో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, స్కిల్ యూనివర్శిటీ, సిటిజన్ హెల్త్‌కేర్, హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కీలకమైన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి అనుసరిస్తున్న భవిష్యత్తు వ్యూహాలకు ప్రపంచ బ్యాంకు మద్దతు మరింత ఊతమివ్వనుంది.
Chief Minister @revanth_anumula and @WorldBank President Ajay Banga discussed a partnership to improve lives of over 4 crore people. Key focus areas include skills development, urban rejuvenation, Net Zero initiatives, and citizen healthcare.
— Telangana CMO (@TelanganaCMO) August 7, 2024
A cross-functional team will be set… pic.twitter.com/6HfKY1GSwt