తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండుగలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలోని దాదాపు కోటి మంది రైతులు, నిరుపేదలు, వ్యవసాయ కూలీ కుటుంబాల్లో ఈ పండుగ కొత్త వెలుగులు తెస్తుందని అన్నారు. రైతు భరోసాను రూ.12 వేలకు పెంచటంతో పాటు వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నగదు సాయం, ఆహార భద్రతను అందించే కొత్త రేషన్ కార్డులు, గూడు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసే నాలుగు సంక్షేమ పథకాల అమలుకు సంక్రాంతి పండుగ నాంది పలుకుతోందని పేర్కొన్నారు. ప్రతి సంక్షేమ పథకం అర్హులైన వారందరికీ చేరాలనేదే తన సంకల్పమని సీఎం అన్నారు. వ్యవసాయంతో పాటు.. ఉపాధి కల్పన, పారిశ్రామిక రంగాలన్నింటా తెలంగాణ రాష్ట్రం తిరుగులేని పురోగమనం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.స్వేచ్ఛా, సౌభాగ్యాలతో ప్రజలందరూ సంతోషంగా, తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి సంబురాలు జరుపుకోవాలని అన్నారు. పతంగులు ఎగరవేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎ రేవంత్ రెడ్డి సూచించారు.