తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహా ఏర్పాటుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారు.. చేతనైతే ఎవడైనా విగ్రహంపై చేయి వేయండి అని కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. రాజీవ్ గాంధీ జయంతి సంధర్బంగా సోమాజిగూడలోని రాజీవ్ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. కేటీఆర్ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. “నీ అయ్య (కేసీఆర్ ను ఉద్దేశిస్తూ) విగ్రహం కోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా” ? అని అన్నారు. సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదని అన్నారు. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలను ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే అని మాట్లాడుతున్నారు.. బిడ్డా.. మీకు అధికారం ఇక కలనే.. ఇక మీరు చింతమడకకే పరిమితం అని అన్నారు. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత తమదని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు.