Friday, April 18, 2025
HomeNewsTelanganaCM Revanth Davos Tour: తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన

CM Revanth Davos Tour: తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన

ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ (#InvestInTelangana) క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలు పంచుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఐటీ, జీవ వైద్య శాస్త్ర రంగానికి ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు, భారీ పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంతో తెలంగాణ ప్రతినిధి బృందం తొలి రోజునే పలువురు ప్రముఖులతో కీలక చర్చలు జరిపింది.

దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో సమావేశమయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం చీఫ్ తో పాటు నిర్వాహకులు, ఇతర ప్రముఖులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో పాటు తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. ప్రభుత్వాలతో పాటు పారిశ్రామికవేత్తలు, వ్యాపార వాణిజ్య వాటాదారులు కలిసికట్టుగా పని చేస్తే ప్రజలు సంపన్నులవుతారని, సుస్థిరమైన అభివృద్ధితో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపడితే ప్రజలు మరింత ఆనందంగా ఉంటారనే దృక్కోణంలో చర్చలు జరిపారు. అనంతరం ఇథియోఫియా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెమెక్ హసెంటో తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.

పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్ మ్యాప్ పై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు తెలంగాణ ప్రతినిధి బృందం నేషనల్ అసోషియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (NASSCOM) ప్రెసిడెంట్ శ్రీమతి దేబ్జానీ ఘోష్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో స్కిల్ డెవెలప్మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించటం, అందుకోసం అనుసరించే భవిష్యత్తు మార్గాలపై చర్చించారు. ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సులు చదువుతున్న యువతకు స్కిల్ డెవెలప్మెంట్, ప్లేస్మెంట్ కమిట్మెంట్, విలువైన ఉద్యోగాల కల్పనకు సాయం అందించే అంశాలపై సంప్రదింపులు జరిపారు. స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 54వ వార్షిక సదస్సు జరుగుతోంది. మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగనుంది. దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుకు పలువురు ప్రవాసీ భారత ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. జ్యూరిచ్ ఎయిర్ పోర్ట్ లో మన దేశానికి చెందిన ప్రముఖులను కలిసి వారితో ముచ్చటించటం సంతోషాన్నిందన్నారు రేవంత్ రెడ్డి. సమ్మిళిత, సంతులిత అభివృద్ధి ద్వారా ప్రజలందరి పురోగతి.. నవ తెలంగాణ నిర్మాణానికై మొదలైన తమ ప్రభుత్వ ప్రయత్నంలో భాగస్వాములు కావటం పట్ల ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తపరిచారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments