Wednesday, June 18, 2025
HomeNewsTelanganaరాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర సందేశం

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర సందేశం

“తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నిర్భందాలు, ఇనుప కంచెలను తొలగించాం. పాలనలో ప్రజలను భాగస్వాములను చేశాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నాం. ఆరింటిలో రెండు గ్యారెంటీలు అమలు చేశాం. కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలి. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలి అన్నది మన ప్రభుత్వ ఆకాంక్ష.

యువత భవిత మాకు ప్రాధాన్యం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందించి… వారి భవిష్యత్ కు గ్యారెంటీ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నాం. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం.

ఈ నూతన సంవత్సరం ‘రైతు మహిళ యువత నామ సంవత్సరం’ గా సంకల్పం తీసుకున్నాం. గత పాలనలో స్తంభించినపోయిన పాలన వ్యవస్థ సమూల ప్రక్షాళనకు సంకల్పించాం. ప్రజా పాలనకు అనుగుణంగా వ్యవస్థల పునర్ వ్యవస్థీకరణ జరుగుతోంది. ప్రజల గోడు వినేందుకు ప్రజా భవన్ లో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కార్యనిర్వాహక వ్యవస్థలో మానవీయత జోడించే ప్రయత్నం చేస్తున్నాం.

గత ప్రభుత్వంలో చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిపుష్ఠం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఆర్థిక, విద్యుత్ రంగాలలో వాస్తవ పరిస్థితులను శ్వేతపత్రాల ద్వారా మీ ముందు ఉంచాం. తర్వలో సాగునీటి రంగంలో జరిగిన అవినీతి పై కూడా శ్వేతపత్రంతో వాస్తవాలు వెల్లడిస్తాం. గత

ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంటామని, దోపిడీకి గురైన తెలంగాణ ప్రజల సంపదను తిరిగి రాబడతామని మాట ఇచ్చాం. ఆ దిశగా చర్యలు మొదలు పెట్టాం.

ఫించన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల కోసం లక్షల మంది అర్హులు పదేళ్లుగా ఎదురు చూశారు. అతి త్వరలో వారి ఆశలు ఫలిస్తాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయి. అధికారం కోల్పోయిన దుగ్ధ, ఈర్ష్యతో కొందరు అధములు చేసే తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రకటనలతో గందరగోళపడవద్దు. ఇది గత పాలన కాదు… జన పాలన. ప్రతి పౌరుడు ఈ ప్రభుత్వాన్ని చేరుకునేందుకు 24 గంటలు ద్వారాలు తెరిచే ఉంటాయి.

అమరులు, ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలు సేకరిస్తున్నాం. ఆ కేసుల నుండి విముక్తి కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఆటో కార్మికులు, అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చాం. జర్నలిస్టుల సంక్షేమం పట్ల మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. త్వరలో వాళ్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

కవి దాశరథి కలం నుండి జాలువారిన విధంగా నా తెలంగాణ కోటి రతనాల వీణగా… కోట్లాది ప్రజల సంక్షేమ వాణిగా… అభివృద్ధిలో శిఖరాగ్రాన నిలవాలని ఆకాంక్షిస్తూ… ఈ నూతన సంవత్సరంలో ప్రతి పౌరుడి ఆకాంక్షలు నెరవేరాలని, తెలంగాణలోని ప్రతి గడపన సౌభాగ్యం వెల్లివిరియాలని, ప్రతి ఇంటా వెలుగులు నిండాలని మనసారా ఆకాంక్షిస్తూ… అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.” అని తన సందేశాన్ని ఇచ్చారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments