సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని అందుకే గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు (వీహెచ్) అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో వచ్చే నెల జరుపబోయే కాంగ్రెస్ బిసి డిక్లరేషన్ సభకు సంబంధించి స్థల పరిశీలన కోసం ఇక్కడికి వచ్చారు. టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో స్థానిక వి కన్వెన్షన్ హాల్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి, పిసిసి జాయింట్ సెక్రెటరీ పటేల్ రమేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. మీడియా సమావేశంలో హనుమంతరావు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడిస్తారని భయంతోనే గజ్వేల్ లో గెలిచే పరిస్థితి లేనందున తన పరువు కాపాడుకోవడానికి సీఎం కేసీఆర్ కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజల్లో ఎంతో మార్పు వచ్చిందని అన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ సభ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని అన్నారు.
బీసీ క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని వి.హనుమంత రావు పేర్కొన్నారు. ఓబీసీకి ప్రత్యేక మినిస్ట్రీ అవసరం ఉందని అన్నారు. 50 శాతం రిజర్వేషన్ సీలింగ్ తొలగించాలన్నారు. బీసీ వ్యక్తి ప్రధాన మంత్రిగా ఉండి బీసీలకు న్యాయం చేయలేకపోతున్నాడని మోదీని విమర్శించారు. అందుకే దేశంలో ఓబీసీ క్యాస్ట్ వైస్ జనగణన జరగాలన్నారు. పబ్లిక్ సెక్టార్ యూనిట్ లని ప్రైవేటు చేయడం మానేయాలన్నారు. అంతేగాక ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉన్నదన్నారు. జ్యూడిషియల్, ప్రైవేట్ సెక్టార్ రిజర్వేషన్లు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేలా చొరవ చూపాలన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి సాధ్యం అవుతుందని అన్నారు. బీసీల తడాఖా చూపించడానికి వచ్చేనెల షాద్ నగర్ పట్టణంలో బీసీ డిక్లరేషన్ సభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కనీసం మూడు లక్షల మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు సమీకరణ చేసే విధంగా ఈ సభ ఉంటుందని అన్నారు. బీసీల ఐక్యత చూపకపోతే మరో ముప్పై ఏళ్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా బీసీల పరిస్థితి మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
మూత ఇప్పకుండానే కోట్లు లాగించేశాడు
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తారని హనుమంతరావు తనదైన స్టైల్ లో ప్రభుత్వాన్ని వాయించారు. మందు సీసా విప్పకుండానే రాష్ట్ర ఖజానాకు రెండువేల కోట్లు సమకూర్చారని కెసిఆర్ కు “మందుచూపు” చాలా ఎక్కువని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎంపిక చేయడం వెనుక కేసీఆర్ భయం ఉందని అన్నారు. సిట్టింగులకు టికెట్లు ఇవ్వకపోతే కెసిఆర్ ను ఎదిరించే స్థాయిలో ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగకుండా పరువు పోకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చారని అన్నారు. పార్టీ వీడుతారని భయపడి పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి కట్టబెడుతున్నారని అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని ఓటమికి భయపడి ఇదంతా జరుగుతుందని అన్నారు.
బలగం సినిమా చూసాం అంతా కలిసిపోయాం
షాద్ నగర్ మీడియా సమావేశంలో సీనియర్ నేత విహెచ్ కాసేపు నవ్వులు పూయించారు.బిఆర్ఎస్ పార్టీ ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసిందని, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తొలి జాబితా విడుదల చేయబోతుందని ప్రశ్నించగా మేము కూడా బలగం సినిమా చూశాం.. ఆ సినిమా చూసి 35 ఏళ్లకింద విడిపోయిన అన్నదమ్ములు కలిశారు.. మేము కలవమా? అంటూ చలోక్తులు విసరడంతో అందరూ నవ్వుకున్నారు. అందర్నీ సమన్వయం చేసి టికెట్లు ఎవరెవరికి ఏలా ఇవ్వాలి ఎవరిని బుజ్జగించాలి అన్ని సర్దుబాట్లు జరుగుతున్నాయని సమాధానం చెప్పారు. అన్నదమ్ములు అన్న తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు సాధారణమైన అని అలాగే మా కాంగ్రెస్ పార్టీలో కూడా అలాంటివే అని కుట్టిపారేశారు. జగ్గారెడ్డితో కూడా మాట్లాడానని అతని మనసులో ఎవరిపై ద్వేషం లేదని ఆయన మనసులో ఉన్న మాట రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారు తప్ప ఎవరి మీద విద్వేషాలు లేవని అన్నారు. నాయకుల మధ్య చిన్న చిన్న తగాదాలు సర్వసాధారణమైనవని వాటిని అధిగమించి వెళ్తామని అన్నారు. పదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై ఇప్పుడు ఎన్నికలకు సర్దుకుంటుందని త్వరలోనే జాబితా ప్రకటన వస్తుందని అన్నారు. కెసిఆర్ చేతిలో అధికారం, మీడియా, లక్షల కోట్ల డబ్బులు, కాంట్రాక్టర్లు, మంది మార్బలం అన్నీ ఉన్నాయని అన్నారు. అన్ని వైభవాలు ఉన్నాయి కాబట్టే సీఎం కేసీఆర్ టికెట్లను తొందరగా ప్రకటించారని కొంచెం కాంగ్రెస్ సంసారం సరిదిద్దుకొని తాము కూడా బరిలో దిగుతామని సమావేశంలో అందర్నీ నవ్వించారు.
బీసీ డిక్లరేషన్ సభకు స్థల పరిశీలన
బిసి డిక్లరేషన్ సభను వచ్చేనెల షాద్నగర్ పట్టణంలో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నట్టు హనుమంతరావు ప్రకటించారు. దీనికోసం స్థల పరిశీలన చేస్తున్నట్టు చెప్పారు. పట్టణంలోని బాలాజీ టౌన్షిప్ ఎదురుగా పార్కింగ్ స్థలంతో పాటు అదేవిధంగా ఆ పక్కనే పెద్ద ఎత్తున సభ నిర్వహించేందుకు వేదిక స్థలం పరిశీలించినట్లు చెప్పారు. ఈ మీడియా సమావేశంలో సీనియర్ నేతలు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, కొంకల్ల చెన్నయ్య, శ్రీకాంత్ రెడ్డి, అందేమోహన్, పురుషోత్తం రెడ్డి, రాజు, దర్శన్ తదితరులు పాల్గొన్నారు.