తెలంగాణ శాసనసభకు జరిగే ఎన్నికల్లో కీలక ఘట్టంమైన ప్రచారానికి మంగళవారం సాయంత్రం 5 గంటలకు తెరపడింది. గత 15 రోజులుగా ప్రచారంతో హోరెత్తిన మైకులు మూగబోయాయి. పోలింగ్ కు 48 గంటల ముందు వరకు మాత్రమే ప్రచారానికి అనుమతి ఉంటుంది. ఇక వివిధ నియోజకవర్గాల్లో ఉన్న స్థానికేతరులు అక్కడినుండి వెళ్లిపోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం నిర్వహించిన ఆయన పలు విషయాలను వెల్లడించారు. రాజకీయ పార్టీలు పంపిణీ చేసే ఓటర్ స్లిప్పుల్లో పార్టీకి సంబందించి ఎలాంటి గుర్తులు ఉండరాదని అన్నారు. రాష్రవ్యాప్తంగా ఇప్పటికే పోలింగ్ నిర్వహణకు పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. పటిష్ట బందోబస్తు నడుమ ఎన్నికలు నిర్వహిస్తామని, ఎలాంటి అసాంఘీక సంఘటనలను ఉపేక్షించమని ఆయన తెలిపారు.