తెలంగాణ రాష్ర్ట అధికారిక చిహ్నం నుంచి చార్మినార్ బొమ్మను తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని.. మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి చార్మినార్ ను సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
గత ప్రభుత్వంలో మంచి జరిగితే దాని గురించి ప్రజలకు చెప్పాలి, కానీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గత అభివృద్ధిని పట్టించుకోకుండా ఒక రాజకీయ కక్షతో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావారణంలో జరగాలని ఆయన అన్నారు. కేసీఆర్ కుపేరు రావొద్దొని, కేసీఆర్ పేరు వినబడవద్దనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోందని దుయ్యబట్టారు. తెలంగాణ అనగానే హైదరాబాద్, వరంగల్ గుర్తొస్తాయని, కాకతీయ సామ్రాజ్యపు వారసత్వ సంపద కాకతీయ కళాతోరణం అనీ..హైదరాబాద్ ప్రతీక చార్మినార్ అని తెలిపారు. తెలంగాణ వారసత్వ సంపద, సంస్కృతికి గుర్తులుగా ఉన్న చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని రాజముద్ర నుంచి తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే విరమించుకోకపోతే తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. హైదరాబాద్ కు 400ఏళ్లు పూర్తైనప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఘనంగా ఉత్సవాలు నిర్వహించిందని గుర్తుచేశారు. అప్పుడు ఉత్సవాలు నిర్వహించిన కాంగ్రెస్ కు ఇప్పుడేమైందో చెప్పాల్సిన అవసరముందని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.