బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే ఈరోజు BRS పార్టీ తన అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ లో కొత్త పాటను విడుదల చేసింది. కొన్నిరోజుల క్రిందనే పాట ప్రోమో వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఫుల్ సాంగ్ ను బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది.
రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో గత పదేళ్ళలో జరిగిన అభివృద్ధిని, తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను పాట రూపంలో కళ్ళకు కట్టినట్టు చూపించే ‘గులాబీల జెండలే రామక్క’ అనే పాటను మంత్రులు కేటీఆర్, హరీష్ రావు శుక్రవారం ప్రగతి భవన్‌లో విడుదల చేశారు.
తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రతిబింబించేలా ఈ పాట ఉందని పాట పాడిన నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి నియోజకవర్గం, తాండ్ర గ్రామానికి చెందిన కొమ్ము లక్ష్మమ్మ, బొల్లె సుశీల, శాంతమ్మ, కలమ్మ, అనసూయలను మంత్రులు అభినందించారు.
సీఎం కేసీఆర్ పాలనలో జరిగిన మంచి పనులు అందరికి పాట రూపంలో అందచేయాలనే ఉద్దేశంతో ఈ పాటను పాడామని, మంత్రులు ఈ పాటను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని గాయకురాల్లు తెలిపారు. తమ గానంతో ఆకట్టుకున్న కొమ్ము లక్షమ్మ బృందానికి మంత్రి కేటీఆర్ పోచంపల్లి చీరలను బహూకరించి సత్కరించారు.
ఈ పాటకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ కీస్‌ను మంత్రులు ప్రత్యేకంగా అభినందించారు. పాట విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది… వందల కొద్ది లైక్లు, షేర్లతో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అయ్యింది. ఇదివరకే విడుదలైన పాట ప్రోమోకు కూడా విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.