Tuesday, March 25, 2025
HomeNewsTelanganaBRS Manifesto: దసరా రోజున బీఆర్ఎస్ మేనిఫెస్టో.. కాంగ్రెస్, బీజేపీలకు దిమ్మితిరిగేలా ఉంటుందని లీకులు

BRS Manifesto: దసరా రోజున బీఆర్ఎస్ మేనిఫెస్టో.. కాంగ్రెస్, బీజేపీలకు దిమ్మితిరిగేలా ఉంటుందని లీకులు

ఇప్పటికే 115 మంది అభ్యర్ధులను మొదటి లిస్టులోనే ప్రకటించిన బీఆర్ఎస్ ప్రతిపక్షాల కంటే ముందే అభ్యర్థులు నియోజక వర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు. దసరాకు మేనిఫెస్టో కూడా విడుదల కానుంది. మేనిఫెస్టోలో ఎలాంటి పథకాలు ఉంటాయి అనేది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన ఆరు గ్యారంటీలకంటే మించి ఉంటాయని పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికే మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకుందని సమాచారం. మేనిఫెస్టోకు సీఎం కేసీఆర్ తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేనిఫెస్టో కాంగ్రెస్, బీజేపీలకు మైండ్ బ్లాంక్ అయ్యే లాగా ఉండబోతోందని లీకులు వస్తున్నాయి.

బీఆర్ఎస్ పార్టీ గతంలో 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టని పథకాలను తీసుకువచ్చి అమలు చేస్తుంది. కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్, హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం లాంటి పథకాలతో పాటు ఇటీవల ప్రకటించిన ముఖ్యమంత్రి అల్పాహారం ( స్కూల్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ ) పథకం లాంటివి మేని ఫెస్టోలో లేకుండా తీసుకువచ్చినవే. అయితే కొన్ని హామీలను మాత్రం అమలు చేయలేదు. ప్రధానంగా వాటిలో దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి వంటి హామీలు అమలుకు నోచుకోలేదు. ఈ సారి నిరుద్యోగ భృతి హామీ ప్రకటించాలా.. లేదా.. అనే డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది.

రైతులకు ఉచితంగా ఎరువుల పంపిణీ పథకం తీసుకు వస్తామని గతంలోనే సీఎం ప్రకటించారు. ఈసారి దీనిని మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉంది. రైతులకు రెండు పంటలకు ప్రభుత్వమే ఉచితంగా యూరియా, డీఏపీ లాంటి ఎరువులను పంపిణీ చేసేలాగా పథకాన్ని తీసుకురానున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పెన్షన్లను రూ.1000 చొప్పున అన్నీ పెంచాలని భావిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, విద్యార్థినులకు సైకిళ్లు, సానిటరీ నాప్‌కిన్లు పంపిణీ లాంటి స్కీంలను తేవాలని, వాటిపై అధ్యయనం చేస్తున్నట్లు సీనియర్ నాయకులు చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను మరింత ప్రయోజనాం ఉండేలా పెంచడంతో పాటు, ఇవి కాకుండా ఇంకా కొత్త పథకాలు తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సారి మహిళలకు, రైతులకు, యువతకు ఎక్కువ లబ్ది చేకూరేలా మేనిఫెస్టో రూపకల్పన ఉండే అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మూడవసారి గెలిచి హాట్రిక్ సాధించాలని సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా విజయ దశమి రోజున పార్టీ మేనిఫెస్టోను ప్రకటిస్తారని తెలుస్తోంది.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments