సీఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగానే కలిశామని.. నిన్న సీఎం రేవంత్ ను కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టంచేశారు. తెలంగాణ భవన్ లో బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. కొందరు తమపై అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారని అన్నారు. తాము పార్టీ మారతారనే ప్రచారాన్ని ఖండించారు. ప్రజాసమస్యలపై చర్చించేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశామని వివరణ ఇచ్చారు. అభివృద్ధి అంశాల్లో సహకరించాలని సీఎంకు విజ్ఞప్తి చేశామన్నారు. పార్టీ మారే ఆలోచన తమకు లేదన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలపై ప్రభుత్వంతో కొట్లాడుతామన్నారు. పార్టీ అధిష్టానానికి తమపై పూర్తి విశ్వాసం ఉందని.. తాము కేసీఆర్ వెంటే ఉంటామని అన్నారు. తమ పరువుకు భంగం కలిగేలా మాట్లాడితే న్యాయపరంగా ముందుకెళ్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ లో బీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామన్నారు.
నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసిన విషయం తెలిసిందే. సీఎంను కలిసిన వారిలో.. సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), కొత్త ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక) , గూడెం మహిపాల్ రెడ్డి (పఠాన్ చెరు) , మాణిక్ రావు (జహీరాబాద్) లు ఉన్నారు.