బీసీ కుల వృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసే లక్ష రూపాయల సాయంలో స్థానిక సర్పంచ్లు, ఎంపీటీసీలు , కౌన్సిలర్లు, కొందరు ప్రజా ప్రతినిధులు లబ్ధిదారుల నుండి రూ.10 వేల నుంచి రూ. 20వేల వరకు వసూలు చేస్తున్నారని మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం జెడ్పి సమావేశమందిరంలో బీసీ కుల వృత్తుల వారికి రూ.లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం పార్టీలో తీవ్ర దుమారం రేపుతుంది. మరోవైపు ఓ ప్రభుత్వ ఉద్యోగి పేరిట బీసీ ఆర్థిక సాయం చెక్కు రావడం సంచలనం కలిగిస్తోంది. అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ, మండల స్థాయి ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పథకాల్లో ప్రదర్శిస్తున్న చేతివాటానికి అద్దంపడ్తోందని పలువురు విమర్శిస్తున్నారు. అర్హుల జాబితా తయారీలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే పేర్కొనటం ద్వారా తనకు ఈ పర్సెంటేజీల వ్యవహారంతో సంబంధం లేదని తప్పించుకునేందుకే అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.