Thursday, March 27, 2025
HomeNewsTelanganaKCR: బీఆర్ఎస్ ప్రస్థానంలో అన్నీ విజయగాథలే.. : కేసీఆర్

KCR: బీఆర్ఎస్ ప్రస్థానంలో అన్నీ విజయగాథలే.. : కేసీఆర్

రెండున్నర దశాబ్దాల బిఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయ గాథలు లేవని, తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని, ఎటువంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణను మరింతగా పొందుకుంటూ ముందడుగు వేస్తుందని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు.

తెలంగాణ అస్థిత్వమే ప్రమాదంలో పడిన దిక్కు మొక్కు లేని చివరిదశ ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన అటునుంచి పదేండ్ల ప్రగతి పాలన దాకా తాను ఎదుర్కున్న కష్టాలను కేసీఆర్ ఈ సందర్భంగా కార్యకర్తలకు వివరించారు.

“ఆనాడు తెలంగాణను అష్ట దిగ్భందనం చేసిన సమైక్యవాద శక్తులు, వారి మీడియాతో సహా సమస్త రంగాలు.. వాళ్లు రాసిందే రాత గీసిందే గీతగా నడిచేదని గుర్తుచేశారు. అత్యంత శక్తివంతమైన ఆంధ్రా వ్యవస్థలను తట్టుకుంటూ, తెలంగాణ వ్యతిరేకతకు, సమైక్య వాదానికి సింబాలిక్ గా ఉన్న నాటి పాలకుడు చంద్రబాబు నాయుడును ఎదిరించి నిలవడం అంటే అషమాషీ వ్యవహారం కాదని.. అటువంటి సమైక్య వాద కుటిల వ్యవస్థలనే బద్దలుకొట్టి తెలంగాణను సాధించి, కలబడి నిలబడిన తెలంగాణ సమాజం, భవిష్యత్తులో ఎటువంటి ప్రతిబంధక పరిస్థితిలనైనా అధిగమిస్తుందని” కేసీఆర్ భరోసా వ్యక్తం చేశారు.

గెలుపు ఓటములకు అతీతంగా తెలంగాణ సమాజం మనకు ఎల్లవేళలా అండగా ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందని కార్యకర్తల జై తెలంగాణ నినాదాల నడుమ కేసీఆర్ ప్రకటించారు. శత్రువుల ప్రత్యర్థుల కుటిల యత్నాలను అధిగమిస్తూ అప్రతిహతంగా కొనసాగుతున్న బిఆర్ఎస్ విజయ ప్రస్థానంలో నిన్నటి ఓటమితో దిష్టి తీసినట్టయిందని, తిరిగి పునరుత్తేజంతో మరింతగా ప్రజాదరణను కూడగట్టాలని కార్యకర్తల హర్షధ్వానాల నడుమ కేసీఆర్ ప్రకటించారు.

ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రేస్ పార్టీ, ఇచ్చిన అలవిగాని హామీలు అమలు చేయడం చేతగాక పలురకాల జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నదని దుయ్యబట్టారు. కాంగ్రేసు పార్టీ నైజం మరోసారి అర్థమైన ప్రజలు, ఓటేసి పొరపాటు చేసినామని నాలిక కరుసుకుంటున్నారని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఎన్నడూ లేనివిధంగా ప్రశాంతమైన పాలన ద్వారా పదేండ్లపాటు సంక్షేమం, అభివృద్ధిని అందిస్తూ అన్ని తీర్లా అండగా నిలబడ్డ బిఆర్ఎస్ పార్టీని తిరిగి తెలంగాణ సమాజం కోరుకుంటున్నదని కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ మీద ద్వేషంతో, అసంబద్ధ ప్రకటనలతో, ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా నడస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరుగబడే రోజులు త్వరలోనే రానున్నాయని వ్యాఖ్యానించారు.

బుధవారం రోజు కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌజ్ లో తనను కలిసేందుకు మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నుండి వచ్చిన కార్య కార్యకర్తలు నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నల్గొండ తదితర జిల్లాల మాజీ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు , ఎంఎల్సీ లు పాల్గొన్నారు. వారిలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంఎల్సీ లు మధుసూదనాచారి, తక్కెళ్ల పల్లి రవీందర్ రావు, కోటిరెడ్డి, గాదరి కిశోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, జీవన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీతా రెడ్డి, నలమోతు భాస్కర్ రావు, రమావత్ రవీంద్ర కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భగత్, బూడిద బిక్షమయ్య గౌడ్, కంచర్ల కృష్ణారెడ్డి, తిప్పన విజయసింహా రెడ్డి, ఒంటెద్దు నర్సింహరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

తన పట్ల తెలంగాణ సమాజం చూపుతున్న ప్రేమాభిమానాలకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అయితే తనను కలిసేందుకు ముందస్తు సమాచారంతో మాత్రమే రావాలని మరోసారి కార్యకర్తలకు అభిమానులకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… “నన్ను కలుద్దానికి పిలిచినోళ్లు పిలవనోళ్లు వేలమంది వస్తున్నరు రోజు. మీ అభిమానానికి థాంక్స్. అయితే అంతమందికి ఐదారు గంటలపాటు నిలబడి ఫోటోలు దిగాల్నంటే కాలిరిగిన నాకూ ఇబ్బందే అయితున్నది. ఒక్క మనిషి వేలమందితోని నిలబడి ఫోటోలు దిగితే ఎంత కష్టమో మీరే చెప్పండి. అందికే సందర్శకులను ముందస్తు సమాచారం మేరకు మాత్రమే ఆహ్వానించాలనుకున్నాం. వారానికి రెండు నియోజకవర్గాల పేర్లు చెప్తం. చెప్పిన వాళ్లు మాత్రమే వస్తే లొల్లి లేకుంట వాళ్లతో కడుపునిండ మాట్లాడుకొని పంపియ్యొచ్చు. మీరు నా మీద ఇంతగా చూపిస్తున్న అభిమానానికి మరోసారి మీకు పేరు పేరునా ధన్యవాదాలు ” అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments