తెలంగాణలో బోనాల పండుగ సందడి వచ్చేసింది. హైదరాబాద్ లోని గోల్కొండ జగదాంబికా అమ్మవారికి తొలి బోనంతో ఆషాడమాస బోనాలు ప్రారంభం అవుతాయి. ఆలయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిశాఖల సమన్వయంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు కల్పించారు.
బోనాలముందు డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల నడుమ అమ్మా బైలెల్లినాదో.. అంటూ సాగే అమ్మవారి ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంటుంది. గోల్కొండ బోనాల అనంతరం ఈనెల 21, 22 తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జరుగుతాయి. ఇదేనెల 28, 29 తేదీల్లో లాల్ దర్వాజ సిహవాహిని బోనాలు జరుగుతాయి.