కురుమల ఆరాధ్యదైవం, కురుమ సంస్కృతికి ప్రతీక, వారిజీవన విధానాన్ని, ప్రతిబింబించే జాతి అస్తిత్వ పండుగ బీరప్ప పెద్దపండుగ. సిద్దిపేట జిల్లా, చేర్యాల మండలం, ఆకునూరు గ్రామంలో అక్క మహంకాళి ఆశీర్వాదంతో శ్రీశ్రీశ్రీ బీరప్ప – కామరాతి మరియు చౌడలమ్మ విగ్రహాల ప్రతిష్టాపన, కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. మార్చి 28 నుండి ఏప్రిల్ 5 వరకు.. వారం రోజుల పాటు జరిగిన బీరప్ప పండుగ ఆకునూరులో బీర్ల వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా, కుల ఆచారం ప్రకారం ఈ ఉత్సవాలు నిర్వహించారు.
ఐదు దశాబ్ధాల (50 సం.ల) తర్వాతఆకునూరులో బీరప్ప పండుగ జరగడంతో అత్యంత వైభవంగా పండుగ జరిగింది. వారం రోజుల కార్యక్రమాలలో ముఖ్యంగా మంద పోచమ్మకు చేయడం, లింగాలకు ఆట పాటలతో గంగకు వెళ్ళడం, బీరప్ప కళ్యాణం, మంద మీద సరుగు వేయడం, కాశి రామక్క కథ, గారడీ వేషం, నాగవెళ్లి బోనాలు, అక్క మహంకాళి, బీరప్ప కామరాతీ వేషాలతో కథలు చెప్పడం లాంటి విభిన్న కార్యక్రమాలతో పండుగ ఆద్యంతం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.
చుట్టు పక్కల ఉన్న పరిసర గ్రామాల ప్రజలు, కురుమ, యాదవుల బందుగణం పెద్ద ఎత్తున పండుగకు హాజరయ్యారు. కురుమ, గొల్లలు అధికంగా ఉన్న ఈ గ్రామంలో పండుగ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంతంగా, ముగిసింది. ఈ పండుగకు సహకరించిన కులస్థులకు, దాతలకు, గ్రామస్థులకు, పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.