Menu

  • Home
  • తెలంగాణ
  • బీసీ రిజర్వేషన్లు పెంచాకే స్థానికఎన్నికలు నిర్వహించాలి:జేఏసీ
Image

బీసీ రిజర్వేషన్లు పెంచాకే స్థానికఎన్నికలు నిర్వహించాలి:జేఏసీ

బీసీ రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని.. బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీసీ జేఏసీ (JAC) ఆదివారం రాజధాని హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున నిరసన గళం వినిపించింది. ‘రన్ ఫర్ సోషల్ జస్టిస్’ పేరుతో బషీర్‌బాగ్ నుండి లోయర్ ట్యాంక్‌బండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, గుజ్జ కృష్ణతో సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా బీసీ రిజర్వేషన్లను పెంచాలని, ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.

బీసీ రిజర్వేషన్లు పెంచకుంటే కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు

బీసీ రిజర్వేషన్లు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం తొందరపడి స్థానిక ఎన్నికలను నిర్వహిస్తే, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోని బీసీలు తగిన గుణపాఠం చెబుతారని బీసీ జేఏసీ నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అన్ని రాజకీయ పార్టీల నేతలతో అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి, బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లాలని డిమాండ్ చేశారు. రేపు జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలోనే ఈ అఖిలపక్ష పర్యటన తేదీని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. అలా కాకుండా బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి మోసం చేస్తే, రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని నాయకులు హెచ్చరించారు.

BC

‘బీసీ రిజర్వేషన్లు.. బీసీ వాదం’ తోనే జూబ్లీహిల్స్ లో విజయం..

బీసీలకు పార్టీపరంగా ఇచ్చే హామీలు, పదవులు తమకు వద్దని, చట్టబద్ధమైన రిజర్వేషన్లు మాత్రమే కావాలని జేఏసీ స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ‘బీసీ వాదం’తోనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందనే విషయాన్ని ఆ పార్టీ మర్చిపోవద్దని నాయకులు గుర్తు చేశారు. డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

బీజేపీ వైఖరిపైనా ఆగ్రహం

బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ వైఖరిని కూడా బీసీ జేఏసీ తప్పుబట్టింది. ఈ అంశంలో బీజేపీ వ్యతిరేకంగా ఉండటం వల్లే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్ గల్లంతైందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలన్నారు. ఒకవేళ కేంద్రం ఈ బిల్లును ఆమోదించకపోతే, రాబోయే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి జూబ్లీహిల్స్ ఎన్నికలలో పట్టిన పరాభవమే ఎదురవుతుందని హెచ్చరిక చేశారు. బీసీ బిల్లు ఆమోదం కోసం డిసెంబర్ మొదటి వారంలో పార్లమెంట్‌ను ముట్టడిస్తామని బీసీ జేఏసీ ఈ సందర్భంగా ప్రకటించింది.

Also Read.. | రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం.. స్థానిక ఎన్నికలపై కీలక నిర్ణయం!

Share the post