ఇటీవల ప్రకటించిన బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని..కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బడ్జెట్ లో బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని బిజెపి రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ మండిపడ్డారు. అబద్ధాల పునాదుల మీద గెలిచిన కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ను అమలు చేయకుండా తప్పించుకోవాలని చూస్తోందని ఫైరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల వేళ స్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న బీసీ రిజర్వేషన్లు 23% నుంచి 42%కు పెంచుతామని వాగ్ధానం చేసి, ఇంతవరకు పెంచలేదన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే సబ్ ప్లాన్ కింద ప్రతి ఏటా రూ.20వేల కోట్ల అంటూ హామీ ఇచ్చి, బడ్జెట్ లో అన్యాయం చేశారన్నారు. బీసీ యువత చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు, ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని, వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు బిజెపి పోరాటం ఉధృతం చేస్తుందని శాంతికుమార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.