భారతదేశ అసలు సిసలైన హీరో శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ యుద్దాల సమయంలో జన సంఘ్ కార్యకర్తలకు తుపాకీలిచ్చి సైనికులతోపాటు భారతదేశం పక్షాన యుద్దానికి పంపి పార్టీ కంటే దేశం ఫస్ట్ అని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ అని పేర్కొన్నారు. దేశం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న ఏకైక జాతీయ పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ లో ఏకైక ప్రతిపక్ష నేత కూడా ఆయనేనని తెలిపారు.
శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్దంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అంతకుముందు మహాశక్తి అమ్మవారి ఆలయంలో సంజయ్ తన మాత్రుమూర్తి శకుంతల సమక్షంలో మొక్క నాటించారు. అనంతరం శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలను, త్యాగాన్ని స్మరిస్తూ ప్రకటన విడుదల చేశారు.
” కాశ్మీర్ వెళ్లడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిట్ కార్డు తప్పనిసరి చేస్తే నా దేశం వెళ్లడానికి పర్మిట్ కార్డు ఎందుకని ప్రశ్నిస్తూ ‘ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్ నహీ నహీ ఛలేగా…నహీ ఛలేగా’ అంటూ 370 ఆర్టికల్ రద్దు కోసం పోరాడిన మహనీయుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ. ఆనాడు పర్మిట్ అవసరం లేదని పేర్కొంటూ కశ్మీర్ బయలుదేరిన శ్యామా ప్రసాద్ ముఖర్జీని నాటి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి కనీస సౌకర్యాలు లేని జైల్లో నిర్బంధానికి గురి చేసింది. ఆనాడు అటువైపుగా వెళుతున్న నాటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ ముఖర్జీని పరామర్శించాలని సోయి లేకుండా వెళ్లిపోయారు. ఆ నిర్బంధంలోనే అనుమానాస్పద స్థితిలో ముఖర్జీ మరణిస్తే కనీసం విచారణ జరపని అమానవీయ ప్రభుత్వం కాంగ్రెస్ ది. ఆయన చనిపోయాక కాశ్మీర్ కు వెళ్లడానికి వీసా తప్పనిసరి అనే విధానాన్ని నెహ్రూ ప్రభుత్వం రద్దు చేసింది. ఇది బీజేపీ సాధించిన తొలి విజయం “.
“దేశం కోసం యుద్దం చేయడానికి సిద్దంగా ఉండాలని జన సంఘ్ కార్యకర్తలను పిలుపునివ్వడమే కాకుండా కార్యకర్తలకు తుపాకీలిచ్చి పాకిస్తాన్ పై యుద్దం చేయడానికి పంపిన వీరుడు. పార్టీ, రాజకీయాల కంటే దేశమే ఫస్ట్ అని చాటి చెప్పిన గొప్ప నేత శ్యామాప్రసాద్ ముఖర్జీ.”
“స్వతంత్ర ఫలాలు అట్టడుగు స్థాయి వరకు తీసుకెళ్లాలని పార్లమెంట్ లో పోరాడితే… డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సైతం శ్యామాప్రసాద్ కు మద్దతు తెలిపారంటే ఆయన గొప్పతనం, కమిట్ మెంట్ ను అర్ధం చేసుకోవచ్చు. ఆనాడు పార్లమెంట్ లో నెహ్రూ మాట్లాడుతూ ‘నీ పార్టీ ఎంత? నువ్వెంత? నీ పార్టీని మొత్తం నాశనం చేస్తా’నని చెబితే…. అందుకు ప్రతిగా నా పార్టీని నాశనం చేయడం సంగతి తరువాత…నాశనం చేస్తాననే మీ ఆలోచననే నాశనం చేస్తానంటూ బదులిచ్చిన నాయకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ. భారతదేశ రక్షణ కోసం అణ్వస్త్రాలు ఉండాలని ఆకాంక్షించిన దూర దృష్టి కలిగిన నాయకుడు”.
“శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆలోచనలను, ఆశయాలను, ఆకాంక్షలను అమలు చేస్తున్న పార్టీ బీజేపీ. ముఖర్జీ ఆకాంక్షలకు అనుగుణంగా వాజ్ పేయి ప్రభుత్వం అణ్వాయుధాలను సమకూరిస్తే… 370 ఆర్టికల్ ను రద్దు చేసి శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలను నరేంద్రమోదీ నెరవేర్చారు. దేశ విభజన సమయంలో అనుకోని పరిస్థితుల్లో మాత్రుభూమికి తిరిగి వస్తే పౌరసత్వ సవరణ బిల్లును తీసుకొచ్చిన ప్రభుత్వం నరేంద్రమోదీదే….శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాల మేరకు మధ్య దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వ ఫలాలను నేరుగా లబ్దిదారులకు అందిస్తున్న ప్రభుత్వం నరేంద్రమోదీదే.” అని బండి సంజయ్ తెలిపారు.