కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ పార్టీయే బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ యే కవితకు బెయిల్ ఇప్పించేందుకు కోర్టులో వాదనలు విన్పిస్తున్నారని చెప్పారు. అందుకు అనుగుణంగానే అభిషేక్ సింఘ్వీకి తెలంగాణ నుండి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధిగా నామినేషన్ వేయించారని తెలిపారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. కేసీఆర్ చెబితేనే కాంగ్రెస్ పార్టీలో ఎంపీ సీట్లు, ప్రభత్వంలో మంత్రి పదవులిస్తున్నారని తెలిపారు. ఈ విషయం తెలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఫాంహౌజ్ కు క్యూ కడుతున్నారని వ్యాఖ్యనించారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ సమీపంలోని రావిరాల గ్రామంలో నిర్వహించిన సూర్యగిరి ఎల్లమ్మ బోనాల ఉత్సవాల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.