బీర్లు, శీతల పానీయాలు, పర్ ఫ్యూముల ఇండస్ట్రీకి అల్యూమినియం టిన్నులను సరఫరా చేసే ‘బాల్ బెవరేజ్ ప్యాకేజింగ్’ కంపెనీ రాష్ట్రంలో రూ.700 కోట్ల పెట్టుబడితో ఉత్పాదన యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ యూనిట్ ప్రారంభమైతే 500 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ‘బాల్’ ఇండియా కార్పోరేట్ వ్యవహారాల అధిపతి గణేశన్ ఆదివారం మంత్రితో సచివాలయంలో బేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తమ సంస్థ విస్తరణ ప్రణాళికను శ్రీధర్ బాబుకు వివరించారు. ‘బాల్’ సంస్థకు రాష్ట్రంలో అవరసరమైన భూమి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని శ్రీధర్ బాబు ఆయనకు హామీ ఇచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రంలో టిన్నుల్లో దొరికే బీర్లు మహారాష్ట్రలో బాట్లింగ్ అవుతున్నాయని మంత్రి తెలిపారు. ఇది 2 శాతం లోపలే ఉందని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో బీర్ల ప్యాకేజింగ్ లో టిన్నుల వాడకం 25 శాతం వరకుందని వెల్లడించారు. రాష్ట్రంలో అల్యూమినియం టిన్నుల్లో బీర్లను బాట్లింగ్ చేయాలంటే ఎక్సైజ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులతో చర్చిస్తానని అన్నారు. 500 మి.లీ పరిమాణంలో బీర్లను అల్యూమినియం టిన్నుల్లో ప్యాక్ చేయడం వల్ల ఎక్సైజ్ డ్యూటీ తగ్గి ప్రభుత్వానికి ఏటా రూ.285 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని శ్రీధర్ బాబు తెలిపారు.
కిందటి సారి తన అమెరికా పర్యటన సందర్భంగా జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో ఉన్న కోకా కోలా కేంద్ర కార్యాలయానికి వెళ్లినప్పుడు పెద్దపల్లి జిల్లాలో కొత్త బాట్లింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసిందని చెప్పారు. రూ.1000 కోట్లతో ఏర్పాటయ్యే కోక్ బాట్లింగ్ యూనిట్ కు ‘బాల్’ సంస్థ అల్యూమినియం టిన్నులను చేస్తుందని వివరించారు. పెట్టుబడులకు సంబంధించి పూర్తి ప్రణాళికను సమర్పించాలని గణేశన్ కు శ్రీధర్ బాబు సూచించారు.