వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పై కొత్తగూడెం ప్రకాశం స్టేడియం లో ఆగ్రి టెక్నాలజీ ఎక్స్ పో ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ చూసి ఆదునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెలుసుకునే అవకాశం ఉందని అన్నారు. రైతులు కాలానుగుణంగా మారి అధిక దిగుబడుల వైపు సాగు పద్ధతులు ఉండేలా రైతులను సాంకేతికంగా చైతన్యం చేయడం కోసం పెద్ద నగరాలకే పరిమితమైన ఆగ్రీ టెక్నాలజీ ఎక్స్ పో ను ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడెం లో ఏర్పాటు చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ప్రజాపాలన వేడుకలు అనంతరం వ్యవసాయ సాంకేతిక ప్రదర్శన కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతాంగానికి పిలుపు ఇచ్చారు.