ఆర్టీసీ కార్మికుల బిల్లుపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర వేశారు. గవర్నర్ ఆమోదంతో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి మార్గం సుగమం అయింది. గవర్నర్ ఆర్టీసీ బిల్లుపై కొన్న సందేహాలు లేవనెత్తటంతో, బిల్లును సభలో ప్రవేశపెట్టడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే రవాణ శాఖ ఉన్నతాధికారులతో రాజ్‌భవన్ లో గవర్నర్ సమావేశం అయ్యారు. తమిళిసై లేవనెత్తిన సందేహాలపై రవాణశాఖ, ఆర్టీసీ అధికారులు ఆమోకు వివరణ ఇచ్చారు. ఈ సమావేశం తరువాత బిల్లుకు గవర్నర్ ఓకే చెప్పారు. దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై పది అంశాలను సిఫారసు చేశారు. ప్రధానంగా న్యాయపర అంశాలు, ఉద్యోగుల ప్రయోజనాలను అందులో గవర్నర్ పేర్కొన్నారు.
Hon'ble Governor Tamilisai Soundararajan has granted her approval for the introduction of the Telangana State Road Transport Corporation (Absorption of Employees into Government Service) Bill 2023 in the Telangana State Legislative Assembly with certain recommendations to the… pic.twitter.com/kzQtTEef3Q
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) August 6, 2023
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను (TSRTC) ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆదివారం ఆమోదం తెలిపింది. గవర్నర్ తమిళిసై ముసాయిదా బిల్లుపై అనుమతి ఇవ్వగానే.. ఆర్టీసీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. బిల్లుపై చర్చ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్సీనే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల బకాయిలను చెల్లిస్తుందని.. ఆర్టీసీ కార్పొరేషన్, ఆర్టీసీ ఆస్తులు అలాగే ఉంటాయని అన్నారు. ఉద్యోగులతో చర్చించిన తరువాత పదవీ విరమణ ప్రయోజనాలను నిర్ణయిస్తామని పువ్వాడ అజయ్ తెలిపారు. బిల్లు ఆమోదం పొందడంతో ఆర్టీసీలోని 43 వేల పైచిలుకు మంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మారారని అన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం ఆర్టీసీ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం కొనసాగుతారు అని మంత్రి తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా పీఆర్సీ అమలు చేస్తాం అని తెలిపారు.