Menu

Image

వాట్సప్ పై రష్యాలో నిషేదం..?

వాట్సప్ పై రష్యాలో నిషేదం విధిస్తారని ఆదేశంలో చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్‌పై రష్యా ప్రభుత్వం పూర్తి నిషేధం విధించేందుకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తమ దేశంలోని చట్టాలకు అనుగుణంగా వాట్సాప్ సేవలు అందించడం లేదని, నేరాల నియంత్రణలో సహకరించడం లేదని ఆరోపిస్తూ రష్యా స్టేట్ కమ్యూనికేషన్స్ వాచ్‌డాగ్ ‘రాస్కోమ్నాడ్‌జోర్’ (Roskomnadzor) ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.

ఉగ్రవాద కార్యకలాపాలకు వేదికగా వాట్సాప్..!

రష్యా అధికారులు వాట్సాప్‌పై రెండు ప్రధాన ఆరోపణలు చేశారు. మొదటిది ఈ ప్లాట్‌ఫామ్ తమ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు, నేరాలను నిర్వహించడానికి, దోషులను నియమించుకోవడానికి దుర్వినియోగం అవుతోందని చెబుతున్నారు. రెండవది, మోసం, ఉగ్రవాద కేసులకు సంబంధించిన దర్యాప్తు కోసం భద్రతా సంస్థలకు యూజర్ల సమాచారాన్ని అందించడానికి వాట్సాప్ నిరాకరిస్తోందని ఆరోపించారు. రష్యా చట్టాలను పాటించకపోతే, వాట్సాప్‌ను పూర్తిగా బ్లాక్ చేస్తామని రాస్కోమ్నాడ్‌జోర్ స్పష్టం చేసింది.

వాట్సాప్‌పై నిషేధం హెచ్చరికల నేపథ్యంలో, రష్యా తమ పౌరులు ‘మ్యాక్స్’ (MAX) వంటి దేశీయ మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించాలని సూచిస్తోంది. ఈ దేశీయ యాప్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (End-to-End Encryption) లేకపోవడం వల్ల, అవసరమైతే అధికారులు యూజర్ల సమాచారాన్ని సులభంగా పర్యవేక్షించే అవకాశం ఉంది. దీనిపై స్పందించిన వాట్సాప్ మాతృసంస్థ మెటా, యూజర్ల డేటా, సురక్షితమైన కమ్యూనికేషన్ హక్కును ఉల్లంఘించేలా మాస్కో చర్యలు తీసుకుంటోందని.. అందులో భాగంగానే వాట్సప్ ను నిషేధించడానికి ప్రయత్నిస్తోందని అంటోంది.

వాట్సప్ పై రష్యాలో నిషేదం ఉక్రెయిన్ అంశం కారణమా ?

రష్యా-ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో మెటా యాజమాన్యంలోని ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఇప్పటికే రష్యాలో నిషేధించబడ్డాయి. ఇప్పుడు, అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్‌పై నిషేధం విధించే అవకాశం ఉండడంతో రష్యాలోని మిలియన్ల యూజర్ల డిజిటల్ స్వేచ్ఛపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Also Read..| నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియా గాంధీలపై కొత్త ఎఫ్ఐఆర్

Share the post

Also Read..