Menu

  • Home
  • అంతర్జాతీయం
  • అమెరికా ఆధీనంలో నికోలస్ మదురో.. అమెరికా చేతుల్లోకి వెనిజులా?
Venezuela president Maduro in custody

అమెరికా ఆధీనంలో నికోలస్ మదురో.. అమెరికా చేతుల్లోకి వెనిజులా?

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అమెరికా కస్టడీలో ఉన్నారనే వార్త ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జనవరి 3, 2026 శనివారం తెల్లవారుజామున అమెరికా నిర్వహించిన “ఆపరేషన్ అబ్‌సొల్యూట్ రిసాల్వ్” (Operation Absolute Resolve) అనే మెరుపు దాడిలో ఈ పరిణామం చోటుచేసుకుంది. వెనిజులా రాజధాని కరాకస్‌లోని మదురో నివాసంపై అమెరికాకు చెందిన ప్రత్యేక దళాలు (Delta Force) మెరుపు దాడి చేశాయి. ఈ ఆపరేషన్‌లో మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను బందీలుగా పట్టుకున్నారు. వారిని తొలుత అమెరికా యుద్ధ నౌకకు, ఆపై విమానంలో న్యూయార్క్‌కు తరలించారు. ప్రస్తుతం మదురో న్యూయార్క్‌లోని ఒక డిటెన్షన్ సెంటర్‌లో (MDC Brooklyn) బందీగా ఉన్నారని తెలుస్తుంది. చేతులకు సంకెళ్లతో ఆయన విమానం దిగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయనపై మాదకద్రవ్యాల అక్రమ రవాణా (Narco-terrorism), మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు అమెరికా కోర్టుల్లో విచారణకు రానున్నాయి.


Venezuela president Maduro in US custody

వెనిజులాలో ప్రస్తుత పరిస్థితి

మదురో అరెస్ట్ తర్వాత వెనిజులాలో (venezuela) తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రాజధాని కరాకస్‌తో పాటు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మదురో ప్రభుత్వం దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి (National Emergency) ప్రకటించింది. మరోవైపు, వెనిజులా సుప్రీంకోర్టు ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ (Delcy Rodriguez) ను తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించింది. అయితే, ఆమె అమెరికా చర్యను “కిడ్నాప్” గా అభివర్ణించి ఖండించారు. ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో మాత్రం దేశానికి స్వేచ్ఛా సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికా చేపట్టిన ఈ అనూహ్య సైనిక చర్య వెనుక దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న రాజకీయ, ఆర్థిక మరియు భద్రతాపరమైన కారణాలు కనిపిస్తున్నాయి. అసలు అమెరికా వెనిజులాపై ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తోంది, ఆ దేశాన్ని ఎందుకు తన ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తోందని ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నాయి.

Venezuela’s leader Delcy Rodríguez after Maduro’s capture

అమెరికాకు, వెనిజులాకు మధ్య వైరం ఈనాటిది కాదు. 1999లో హ్యూగో చావెజ్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వెనిజులా సోషలిస్ట్ విధానాలను పాటిస్తూ అమెరికాను వ్యతిరేకిస్తోంది. 2024లో జరిగిన ఎన్నికల్లో మదురో అక్రమాలకు పాల్పడి గెలిచారని, ఆయన ఎన్నిక చెల్లదని అమెరికా వాదిస్తోంది. ప్రజాస్వామ్యం పేరుతో మదురోను తొలగించి, తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేయడం అమెరికా లక్ష్యంగా కనిపిస్తుంది.

నార్కో-టెర్రరిజం, డ్రగ్స్ ఆరోపణలు

అమెరికా మదురోను బంధించడానికి ప్రధాన కారణంగా “నార్కో-టెర్రరిజం” (Narco-terrorism) ను చూపుతోంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కేవలం రాజకీయ నాయకుడే కాకుండా, ఒక భారీ డ్రగ్ కార్టెల్ (Cartel de los Soles) కు నాయకత్వం వహిస్తున్నారని అమెరికా అటార్నీ జనరల్ ఆరోపించారు. వెనిజులా గుండా టన్నుల కొద్దీ కొకైన్‌ను అమెరికాలోకి పంపిస్తూ, అమెరికన్ల ప్రాణాలతో మదురో చెలగాటం ఆడుతున్నారని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. ఈ డ్రగ్స్ ద్వారా వచ్చే డబ్బును మదురో తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మరియు ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుతున్నారని అమెరికా ఆరోపిస్తోంది.

వెనిజులా చమురు నిల్వలపై అమెరికా కన్ను పడిందా ?

ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు (Oil Reserves) కలిగిన దేశం వెనిజులా. గతంలో అమెరికా కంపెనీలు అక్కడ చమురు వెలికితీత పనులు చేసేవి, కానీ మదురో ప్రభుత్వం వాటిని జాతీయం చేసి అమెరికాకు చమురు సరఫరాను అడ్డుకుంది. తాజా ఆపరేషన్ తర్వాత ట్రంప్ చేసిన ప్రకటనలో, “వెనిజులా చమురును మళ్ళీ ప్రపంచ మార్కెట్లోకి తెస్తాం, అమెరికన్ కంపెనీలు అక్కడ ఉత్పత్తిని ప్రారంభిస్తాయి” అని స్పష్టం చేశారు. ఈ యుద్ధానికి అయిన ఖర్చును కూడా వెనిజులా చమురు అమ్మకాల నుంచే వసూలు చేస్తామని ఆయన చెప్పడం గమనార్హం.

అక్రమ వలసల సమస్య

వెనిజులాలో మదురో పాలన వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా గత పదేళ్లలో సుమారు 80 లక్షల మంది ప్రజలు దేశం విడిచి వలస వెళ్ళారు. వీరిలో అత్యధికులు అమెరికా సరిహద్దుల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. మదురో కావాలనే తన దేశంలోని జైళ్లలో ఉన్న నేరస్థులను విడుదల చేసి అమెరికాకు పంపిస్తున్నారని ట్రంప్ గతంలోనే ఆరోపించారు. ఈ వలసల వల్ల అమెరికా అంతర్గత భద్రతకు ముప్పు ఏర్పడిందని, అందుకే మదురోను గద్దె దించి అక్కడ శాంతిని నెలకొల్పడం తమ బాధ్యతని అమెరికా అంటుంది.

అమెరికా చేపట్టిన ఈ సైనిక చర్యను అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనగా పలు దేశాలు పరిగణిస్తున్నాయి. ముఖ్యంగా రష్యా, చైనా వంటి దేశాలు అమెరికా వైఖరిని “సాయుధ దురాక్రమణ” (Armed Aggression) అని, ఒక సార్వభౌమ దేశాధ్యక్షుడిని బలవంతంగా అదుపులోకి తీసుకోవడం ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు విరుద్ధమని స్పష్టం చేశాయి. లాటిన్ అమెరికా దేశాలైన బ్రెజిల్, కొలంబియా, మెక్సికో ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాయి. అంతేకాదు, ఇది మళ్ళీ పాత కాలపు వలసవాద ఆధిపత్యాన్ని గుర్తుకు తెస్తోందని ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తోందని (Hegemonic behaviour), ఇలాంటి ఏకపక్ష దాడులు ప్రపంచ శాంతికి, ప్రాంతీయ సుస్థిరతకు భంగం కలిగిస్తాయని ఈ దేశాలు వాదిస్తున్నాయి. మదురోను తక్షణమే విడుదల చేయాలని, వెనిజులా ప్రజలే వారి భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశం ఇవ్వాలని ఆదేశాలు డిమాండ్ చేస్తున్నాయి.

Also Read..| జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

Share the post

Also Read..