Menu

  • Home
  • తెలంగాణ
  • ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి జూప‌ల్లి.. వైద్యులపై ఆగ్రహం
Image

ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి జూప‌ల్లి.. వైద్యులపై ఆగ్రహం

కొల్లాపూర్ లోని ప్ర‌భుత్వ ఆసుపత్రిని ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖామంత్రి జూప‌ల్లి కృష్ణారావు బుధ‌వారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలో సూప‌రిండెంట్, డాక్టర్లు డ్యూటీకి రాలేదని గుర్తించిన మంత్రి, వారి గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి (DMHO) డాక్టర్ స్వ‌రాజ్య‌ల‌క్ష్మిని మంత్రి ఆదేశించారు. ఒకవైపు రోగుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకు ప్ర‌భుత్వం సౌక‌ర్యాలు క‌ల్పిస్తుంటే, మరోవైపు వైద్యులు, సిబ్బంది విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌కుండా నిర్ల‌క్ష్యం వ‌హించ‌డం స‌మంజ‌స‌మేనా అని ప్ర‌శ్నించారు. స‌మ‌య‌పాల‌న పాటించాలని.. లేకుంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

ఆస్పత్రిలోని పలువురు పేషెంట్లతో మంత్రి జూప‌ల్లి మాట్లాడి వైద్య సేవలపై ఆరాతీశారు. డాక్ట‌ర్లు, న‌ర్పులు స‌రైన స‌మ‌యానికి రావ‌టం లేద‌ని, పేషెంట్లపట్ల కొందరు దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని మంత్రికి వివ‌రించారు. వైద్య‌లు, సిబ్బంది రోగుల‌కు అందుబాటులో ఉండి సేవ‌లు అందించాల‌ని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందజేసే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. అనంతరం దవాఖానలోని పలు విభాగాలను మంత్రి పరిశీలించారు. వైద్యంకోసం వస్తున్న పేషెంట్లు వివిధ విభాగాలను తెలిగ్గా గుర్తించేలా సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాల‌న్నారు. త్వరలో ఆసుపత్రి అభివృద్ధిపై కమిటీని ఏర్పాటు చేస్తామని.. ఆసుప‌త్రి అభివృద్ధికి నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ. 25 ల‌క్ష‌లు కేటాయించ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.

Share the post