గణేష్ నవరాత్రులు అనగానే మనకు మొదటగా గుర్తుకువచ్చే పేరు ఖైరతాబాద్ మహా గణపతి (Khairatabad Ganesh). దేశంలోనే అతిపెద్ద విగ్రహం మన ఖైరతాబాద్ వినాయకుడు. ఉత్సవ కమిటీ గత 70 యేళ్లుగా నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఖైరతాబాద్ లో ఈ వినాయకున్ని ఏర్పాటు చేయడం 70 యేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తు ఉన్న వినాయకుడి విగ్రహాన్ని తయారుచేశారు. ఈ సంవత్సరం సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో బడా గణనాథుడు భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. భారీ గణనాధుని దర్శనానికి ఉదయం నుండే భక్తులు తరలి వస్తున్నారు. ఉత్సవ కమిటీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లకోసం బారికేడ్లను ఏర్పాటు చేశారు. మహాగణనాథుని వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మండపం చుట్టుపక్కల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పార్కింగ్ కోసం భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
సీఎం రేవంత్ తొలిపూజ..
ఖైరతాబాద్ బొజ్జ గణపయ్యకు తొలిపూజను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించారు. ఆయనకు ఉత్సవ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. సీఎం రేవంత్ తో పాటు హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ తొలిపూజలో ముఖ్యమంత్రితో పాటు పాల్గొన్నారు.
ఈసందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గత 70 సంవత్సరాలుగా కమిటీ భక్తి, శ్రద్దలతో గణపతి ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయం అని కొనియాడారు. ఈసారి హైదరాబాద్ మహానగరంలో 1 లక్షా 40 వేలకు పైగా విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారని అన్నారు. ఈ సంవత్సరం గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని ఇప్పటికే ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీచేసింది. వర్షాలు, వరదల బీభత్సం సృష్టించినా.. ఆదేవుడు దయతో వరదల నుండి బయట పడ్డామని అన్నారు. స్వర్గీయ పి జనార్థన్ రెడ్డి (పీజేఆర్) హయాం నుండి ఖైరతాబాద్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందించ విషయమని అన్నారు. గతంలో తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు. ఎల్లవేలలా ప్రభుత్వం ఉత్సవ సమితికి అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించినందునే ఉత్సవ కమిటీలను ఆహ్వానించి వారి విజ్ఞప్తి మేరకు మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ఖైరతాబాద్ విశిష్ట గణపతిని సందర్శించి ముఖ్యమంత్రి గారు… pic.twitter.com/Q8fwlPBNDK
— Telangana CMO (@TelanganaCMO) September 7, 2024
గవర్నర్ ప్రత్యేక పూజలు..
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బడా గణేషున్ని దర్శించుకున్నారు. గవర్నర్‌కు నిర్వాహకులు, పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని.. ప్రజలందరిపై ఆ ఏకదంతుని ఆశీస్సులు ఉండాలని మొక్కుకున్నానని గవర్నర్ తెలిపారు.
The Hon'ble Governor of Telangana, Sri Jishnu Dev Varma, performed a special puja at the towering 70-foot-tall Khairatabad Lord Ganesh idol, one of the tallest and most revered Ganesha idols in the country. pic.twitter.com/zy2WndzbyY
— Governor of Telangana (@tg_governor) September 7, 2024