భారతదేశంలోనే ప్రఖ్యాత ఆలయంగా కొండగట్టును తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి (Chief Minister) కేసీఆర్ (K. Chandra Sekhara Rao) అధికారులను ఆదేశించారు. కొండగట్టు ఆలయాన్ని సందర్శించిన ఆయన స్వామివారి దర్శనం అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జగిత్యాల జిల్లా(ఉమ్మడి కరీంనగర్) మల్యాల మండలంలోని కొలువై ఉన్న కొండగట్టు ఆలయన్నిదేశంలోనే ప్రముఖ హనుమాన్ (Hanuman) ఆలయంగా అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు. దేశంలో అతిపెద్ద హనుమాన్ ఆలయం అనగానే కొండగట్టు అనే విధంగా ఉండాలన్నారు. సుమారు మూడు గంటల పాటు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రపంచంలలోనే అత్యద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు సుమారు 850 ఎకరాల్లో చేపట్టనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. అన్నదాన సత్రం, పుష్కరిణి, కళ్యాణ కట్ట, కోనేరులను అభివృద్ధి చేయాలని అన్నారు. వీటితో పాటుగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం సుమారు 86 ఎకరాల్లో విశాలమైన పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఒకేసారి వేల మంది హనుమాన్ దీక్ష మాలధారణ, దీక్ష విరమణ చేసేలా, భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆలయంలో సౌకర్యాలు బాగుంటేనే భక్తులు పెరుగుతారని సీఎం అన్నారు. కొండగట్టుకు ఇదివరకే ప్రకటించిన 100 కోట్లుకు మరో 500 కోట్లు అదనంగా కేటాయించి క్షేత్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ వివరించారు.
కొండగట్టుకు 1000 కోట్లు ఇచ్చేందుకైనా సిద్దమని సీఎం కేసీఆర్ ప్రకటించారు. యాదాద్రి తరహాలో కొండగట్టును కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గర్భాలయం మినహా ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం దేవాలయ విస్తరణ, ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వాస్తు నియమ నిబంధనల ప్రకారం నిర్మాణాన్నిఎలా చేపట్టాలో ముందుగానే ప్లాన్ చేయాలని కేసీఆర్ అన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే మంగళవారం, శనివారం, ఆదివారాలతో పాటుగా హనుమాన్ జయంతి, ఇతర పండుగల సమయాలలో భక్తులందరికీ అసౌకర్యం లేకుండా ఆలయ నిర్మాణ పనులు జరపాలని సూచనలు చేశారు.
క్యూలైన్ల నిర్మాణంతో పాటుగా, ఒకే సారి ఎంత మంది భక్తులు వచ్చినా కూడా ఇబ్బందులు తలెత్తకుండా రవాణా సౌకర్యాలు, సువిశాలమైన ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేయాలని వివరించారు. ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి శిల్పులను సమకూర్చాలని ఆనంద్ సాయికి సీఎం సూచించారు. ఆలయం పూర్తి కావడానికి సుమారుగా 3 సంత్సరాల సమయం పడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. కొండగట్టు చుట్టూ ఉన్న చెరువుల వివరాలను కేసీఆర్ ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే మళ్లీ కొండగట్టుకు వస్తానని.. ఆలయ సమీక్ష నిర్వహిస్తానని సీఎం తెలిపారు.