దుబాయ్.. ఎడారిలో ఉన్న ఒక అద్బుత ఖరీదైన నగరం.. దీని అబ్బురపరిచే శోభ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రపంచ ప్రజలను తన వైపుకు తిప్పుకుంటుంది. అలాంటి దుబాయ్‌లో రెండేళ్లుగా జడ లేకుండా పోయిన వర్షం.. ఒకే రోజు కురిసింది. యుఎఇ, ఒమన్, పరిసర ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఇది క్లౌడ్ సీడింగ్ వల్లనా లేదా మరేదైనా ప్రకృతి వైపరీత్యమా..? అనే సందేహంలో ఉన్నారు శాస్త్రవేత్తలు. వరదల్లో మునిగిపోయిన ఈ ఎడారి దేశంలో హఠాత్తుగా ఏం జరిగిందో తెలియక జనాలు అయోమయంలో పడ్డారు.
16-17 ఏప్రిల్ 2024న అకస్మాత్తుగా ఈ ఎడారి నగరంలో భారీ వర్షాలు మొదలయ్యాయి. వర్షం ఆగడం లేదు. మెరుపులు, ఉరుములు బెంబేలెత్తించాయి.. చుట్టూ దట్టమైన చీకటి అలుముకుంది. కొద్ది సేపటికే ఆకస్మిక వరద మొదలైంది. విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, మాల్స్, రోడ్లు, వ్యాపార సంస్థ ల్లోకి వరద నీరు చేరింది. పాఠశాలలు మూత పడ్డాయి..
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత 24 గంటల్లో 160 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణంగా రెండేళ్లలో జరుగుతుంది.
ఇది స్వతహాగా పెద్ద ప్రకృతి విపత్తు అంటున్నారు విశ్లేషకులు, పరిశోధకులు.. క్లౌడ్ సీడింగ్ అంటే కృత్రిమ వర్షం వల్ల ఇలా జరిగిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దుబాయ్ సోమ, మంగళ వారాల్లో క్లౌడ్ సీడింగ్ కోసం విమానాలను నడిపింది. ఏదో తప్పు జరిగినట్లుంది.
వాతావరణంలో అవసరమైన మార్పులు చేయడానికి టెక్నాలజీ పేరుతో మనుషులు చేసిన అజాగ్రత్త ప్రయత్నం ఇది.. 15-16 తేదీల్లో అల్-ఐన్ విమానాశ్రయం నుంచి క్లౌడ్ సీడింగ్ విమానాలు వెళ్లాయని గల్ఫ్ స్టేట్ నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ తెలిపింది. గత రెండు రోజుల్లో ఈ విమానాలు ఏడు సార్లు ప్రయాణించాయి. క్లౌడ్ సీడింగ్ తప్పు జరిగినట్లు కనిపిస్తోంది..