Menu

khameni dead

ఇరాన్ సుప్రీం ఖమేనీ హతం.. ప్రతిగా ఇరాన్ భీకర దాడులు

అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా నిర్వహించిన భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీమ్ అయతుల్లా అలీ ఖమేనీ హతం చెందారు. టెహ్రాన్‌లోని ఆయన నివాసంపై జరిగిన ఈ దాడిలో ఖమేనీతో పాటు పలువురు కీలక సైనిక అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామం ఇస్లామిక్ దేశాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుందిచ, గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.

ఖమేనీ హతం.. ఇరాన్ దాడులు తీవ్రతరం

ఖమేనీ మరణంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతోంది. తమ నాయకుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సైన్యం (IRGC) ప్రకటించింది. ఇందులో భాగంగానే ఇజ్రాయెల్‌పై వందలాది బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. టెల్ అవీవ్, జెరూసలేం నగరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేయగా, ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అయినప్పటికీ, కొన్ని క్షిపణులు జనావాసాలపై పడటంతో ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

iran supreme khameni dead

మరోవైపు ఇరాన్ తన దాడులను కేవలం ఇజ్రాయెల్‌కే పరిమితం చేయకుండా గల్ఫ్ దేశాలపైకి కూడా మళ్లించింది. అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయనే నెపంతో యూఏఈ (UAE), బహ్రెయిన్, ఖతార్ వంటి దేశాలపై క్షిపణి దాడులు జరిగాయి. దుబాయ్, అబుదాబి, దోహా నగరాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. విమాన సర్వీసులు రద్దు కావడంతో పాటు అంతర్జాతీయ చమురు సరఫరాపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించారు. ఇరాన్ తన దూకుడును తగ్గించకపోతే, ఆ దేశం మునుపెన్నడూ చూడని రీతిలో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. “ఇరాన్ తప్పు చేస్తోంది, వారు ఎదురుదాడికి దిగితే మేము మరింత శక్తివంతంగా స్పందిస్తాం” అని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా తన మిత్రదేశాల రక్షణ కోసం ఎంతటి కఠిన నిర్ణయానికైనా తాము వెనుకాడబోదని ఆయన హెచ్చరించారు.

ఇరాన్ సైన్యం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. “ట్రూ ప్రామిస్-4” పేరుతో ఇజ్రాయెల్ దాని మిత్రదేశాలపై మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇరాన్ అంతటా 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించిన ప్రభుత్వం, అదే సమయంలో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని తమ దళాలకు ఆదేశాలు జారీ చేసింది. అగ్రరాజ్యం అమెరికా జోక్యం చేసుకుంటే పశ్చిమాసియాలోని అన్ని అమెరికా స్థావరాలను నామరూపాలు లేకుండా చేస్తామని ఇరాన్ ప్రతిజ్ఞ పూనింది.

khameni dead iran isarel

ఈ యుద్ధ వాతావరణం వల్ల మిడిల్ ఈస్ట్ దేశాలలో సాధారణ ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇజ్రాయెల్‌లోని ప్రజలు బాంబు షెల్టర్లలో తల దాచుకుంటుండగా, ఇరాన్‌లోఇంటర్ నెట్ పై ఆంక్షలు విధించారు.

గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు ఆందోళన చెందుతున్నారు. యుద్ధం గనుక మరింత విస్తరిస్తే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇరాన్ అంతర్గత రాజకీయాల్లోనూ మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఖమేనీ మరణం తర్వాత దేశాన్ని నడిపించేందుకు తాత్కాలికంగా ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం.

ఇరాన్ లో దశాబ్దాలుగా ఉన్న నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపే వారు ఈ సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. “ఇది ఇరాన్ ప్రజలకు విముక్తి కలిగించే సమయం” అని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

ప్రస్తుతానికి ఇరుపక్షాల మధ్య చర్చలకు అవకాశం కనిపించడం లేదు. ఐక్యరాజ్యసమితి శాంతి కోసం విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ, అటు ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ తమ పట్టుదలను వీడటం లేదు. ఈ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Share the post

Also Read..