1983లో తెలుగుదేశం పార్టీ (TDP) తెలుగు రాజకీయాల్లోకి ప్రవేశించి, అప్పటి వరకూ అజేయంగా కనిపించిన కాంగ్రెస్ పాలనను కూల్చివేసింది. అలాంటి తెలుగుదేశం పార్టీ ప్రత్యేక పరిస్థితుల్లో ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించింది. దీంతో నాలుగు దశాబ్దాలుగా టీడీపీ సైకిల్ గుర్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులపై ఉంటూ వస్తోంది. కానీ ఈసారి 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులపై సైకిల్ గుర్తు కనుమరుగు కానుంది. గతంలో ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నతరుణంలో రాజకీయాలపై, ముఖ్యంగా తెలంగాణలోని టీడీపీ ఓటు బ్యాంకు ఏ పార్టీ వైపు వెళ్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
తెలంగాణ రాజకీయాలలో టీడీపీ ప్రత్యేకత చాటుకుంది. ముఖ్యంగా బీసీలకు సరికొత్త రాజకీయ గుర్తింపును తీసుకొచ్చిన ఘనత టీడీపీదేనని చెప్పవచ్చు. ఒకానొక సమయంలో బీసీల పార్టీ అనే ముద్ర కూడా టీడీపీకి ఉండేది. మహిళా స్వయం సహాక బృందాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడా టీడీపీకే దక్కుతుంది. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసింది కూడా టీడీపీ హయాంలోనే.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీకి “ఆంధ్రా పార్టీ” అనే ముద్ర పడిపోయింది. ఈ కారణంగానే టిడిపి ఓటర్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. తెలంగాణ ఉధ్యమ సమయం నుండే ఆంధ్రా పార్టీ అనే ముద్ర పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నికయ్యారు. అప్పటినుండే చంద్రబాబు తెలంగాణలో టీడీపీ పార్టీకి, పార్టీ నేతలకు తగిన సమయం ఇవ్వడంలేదనే విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పటినుండి పార్టీ ప్రజాదరణ తీవ్రంగా దెబ్బతింటూ వస్తోంది. ఇంత తగ్గుముఖం పట్టినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ టీడీపీకి ఓటు బ్యాంకు ఉంది. ఆశ్చర్యకరంగా 2014 ఎన్నికల్లో టీడీపీ 15 సీట్లు సాధించగలిగింది. టీడీపీ భాగస్వామ్య పక్షమైన బీజేపీ 5 సీట్లు గెలుచుకుంది. కొన్నేళ్లుగా తెలంగాణ టీడీపీకి చెందిన నాయకులు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతూ ఉన్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయడం లేదని ప్రకటించగానే.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఙానేశ్వర్ రాజీనామా చేసి బీఆర్ఎస్ (BRS)లో చేరిపోయాడు.
టీడీపీ ప్రధానంగా హైదరాబాద్ తో పాటు సీటీ చుట్టుపక్కల ఉన్న ప్రభావవంతమైన కమ్మ సామాజికవర్గ ఓటు బ్యాంకును కలిగి ఉంది. అంతేకాకుండా ఆ పార్టీతో సుదీర్ఘ కాలంగా అనుబంధం కలిగి ఉన్న బీసీ ఓటు బ్యాంకు కూడా ఉంది. హైదరాబాద్‌లో ఆరు నుంచి ఏడు నియోజకవర్గాలలో, ఖమ్మంలోని నాలుగు నియోజక వర్గాల్లో, నిజామాబాద్‌లోని మూడు, నల్గొండ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ప్రభావం చూపే ఈ సామాజిక వర్గం ఓటు బ్యాంకు టీడీపీకి ఉంది.
చంద్రబాబు అరెస్ట్ తరువాత
స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అరెస్టుపై బీఆర్ఎస్ ఉదాసీనంగా స్పందించింది అనే వాదన వల్ల టీడీపీ మద్దతుదారులలో ఆగ్రహం వ్యక్తమైంది. అంతే కాకుండా చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేఖంగా హైదరాబాద్ లో నిరసనలకు ప్రభుత్వం అనుమతి నిరాకరణ విషయంలో కూడా వారి అసంతృప్తికి మరింత ఆజ్యం పోసిందనే వాదన వినిపిస్తోంది.
కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కానుందా ?
టీడీపీ మద్దతుదారులను బుజ్జగించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ.. చంద్రబాబు విధేయులు పార్టీ మారడం వల్ల కాంగ్రెస్‌కే లాభం చేకూరే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు (TPCC) రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్న నేపథ్యం, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP)తో బీఆర్ఎస్ పార్టీ మిత్రపక్షంగా ఉండడం వంటి ప్రధాన కారణాల వల్ల టీడీపీ క్యాడర్ ఓట్లు, వారి అనుకూల సామాజిక వర్గం ఓట్లు ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయాల నుంచి టీడీపీ కాస్త వెనక్కు తగ్గడంతో ఒక్కసారిగా రాజకీయ రూపురేఖలు మారిపోతున్నాయి. టిడిపి మద్దతుదారులు, టీడీపీని ఆదరించే ప్రధాన సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏది ఏమయినా, ఎవరు ఎవరికి మద్దతు ఇచ్చారనే విషయం తెలియాలంటే తెలంగాణ ఎన్నికలు అయ్యేంత వరకు వేచి చూడవలసిందే.