జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపు కేవలం సాధారణ గెలుపుగా కాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మక ప్రణాళికకు అద్దం పడుతోంది. ఈ నియోెజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ లేదనే వాస్తవాన్ని గుర్తించిన ఆయన, ఓటర్లను ఆకర్షించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. ఈ విజయం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమ మరోసారి నిరూపించింది.
జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ ను ఎంపిక చేయడం వెనుక..
ఈ ఎన్నికలో కాంగ్రెస్ విజయాన్ని నిర్ణయించిన కీలక అంశం అభ్యర్థి ఎంపిక. మైనార్టీ ఓట్ల ప్రాధాన్యతను, ఎంఐఎం పట్టును దృష్టిలో ఉంచుకుని అభ్యర్థిని ఎంపిక చేశారు. ఆర్థికంగా బలం ఉన్న నవీన్ యాదవ్‌ను ఎంపిక చేయడంలో సీఎం విజయవంతమయ్యారు. ముఖ్యంగా, అజారుద్దీన్‌ను పోటీకి నిలపడం వల్ల మైనార్టీ ఓట్లు ఏకమైనా, బీజేపీ చేసే ఓటు చీలిక ప్రయత్నం ఇబ్బందికరంగా మారుతుందని ముందే గ్రహించడం ఆయన వ్యూహంలో అత్యంత కీలకం. అందుకే, వ్యూహాత్మకంగా అజారుద్దీన్ కు మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. కేబినెట్ లో మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించినట్టయింది. తద్వారా మైనార్టీ వర్గాల్లో కాంగ్రెస్ పట్ల సానుకూలత వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహించింది. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి, సీఎం స్వయంగా పర్యవేక్షించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపారు. కొత్త ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలు గురించి ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లడంపై దృష్టి సారించారు. అంతేకాకుండా, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేస్తున్న ప్రతికూల ప్రచారాలను ఎదుర్కొనేందుకు కార్నర్ మీటింగ్‌లు ఉపయోగపడ్డాయి. అనవసరమైన రెచ్చగొట్టే అంశాలపై స్పందించకుండా ఉండమని నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ వివాదాలకు దూరంగా ఉండి, కేవలం అభివృద్ధి నినాదంపైనే దృష్టి సారించింది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన మెజార్టీ చారిత్రకమైనదిగా పలువురు చెబుతున్నారు. ఈనియోజకవర్గంలో ఇంతకు ముందు ఏ అభ్యర్థికి ఇంత భారీ మెజార్టీ రాకపోవడం దీనికి నిదర్శనం. ఓటర్లను తమవైపు తిప్పుకోవడంలో, ముఖ్యంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చడంలో కాంగ్రెస్ విజయవంతమైంది.
Also Read..| ప్రపంచ మార్కెట్‌కు గేట్‌వే ఏపీ : చంద్రబాబు నాయుడు
జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. గత సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదనే లోటును ఈ ఉపఎన్నిక ఫలితాలు కొంతమేర పూడ్చాయి. మొత్తానికి జూబ్లీహిల్స్ గెలుపు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ఏవిధంగా ప్రభావితం చేస్తాయో తెలియాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది.









