తెలంగాణ కాషాయ దళానికి 2025 సంవత్సరం అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చినా, ముగింపు మాత్రం అనేక ప్రశ్నార్థకాలను మిగిల్చింది. అధికార పీఠమే లక్ష్యంగా అడుగులు వేయాలనుకున్న కమలనాథులకు, బయటి ప్రత్యర్థుల కంటే సొంత పార్టీలోని ‘కుంపట్లు’ పక్కలో బల్లెంలా మారాయి. ఎంపీల మధ్య ఆధిపత్య పోరు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం, పాత-కొత్త నేతల మధ్య పెరిగిన అగాధం వెరసి.. తెలంగాణ బీజేపీని అయోమయంలో నెట్టేశాయి. గెలిచిన చోట విజయోత్సాహం కంటే, ఓడిన చోట అంతర్గత కుమ్ములాటలే ఎక్కువగా వినిపించాయి. అసలు తెలంగాణ బీజేపీని పట్టి పీడిస్తున్న ఆ ‘ఇంటర్నల్ వార్’ ఏంటి? కొత్త సారథి పగ్గాలు చేపట్టినా, పాత వైషమ్యాలు ఎందుకు సమసిపోలేదు? కమలదళానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఆ అంశాలేంటి..?
2025 క్యాలెండర్ ప్రారంభం కాగానే తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో ఒక సంచలనాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచాయి. అధికార పక్షం తనకున్న సర్వశక్తులను ఒడ్డినప్పటికీ, ధనబలాన్ని, అంగబలాన్ని తట్టుకొని ఆదిలాబాద్ – నిజామాబాద్ – కరీంనగర్ – మెదక్ పట్టభద్రుల స్థానం నుండి అంజిరెడ్డి, అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య ఘనవిజయం సాధించారు. ఈ గెలుపు పార్టీ కేడర్‌లో కొత్త రక్తాన్ని నింపిందని, రాబోయే ఎన్నికలకు ఇది ఒక దిక్సూచి అని అందరూ భావించారు. కానీ, ఈ విజయాన్ని ఆస్వాదించేలోపే పార్టీలో ముదిరిన అంతర్గత విభేదాలు ఆ ఉత్సాహంపై నీళ్లు చల్లాయి. గెలుపు తెచ్చిన మైలేజీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాయకత్వం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర బీజేపీలో వారసత్వ పోరు తరహాలో అధ్యక్ష పదవి కోసం రసవత్తర రాజకీయం నడిచింది. పార్టీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి; ఒకటి క్షేత్రస్థాయి నుండి వచ్చిన పాత నేతల వర్గం కాగా, మరొకటి ఇతర పార్టీల నుండి వచ్చి చేరిన ప్రభావవంతమైన నేతల వర్గం. ఈ వర్గ పోరు కారణంగా నెలల తరబడి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ స్తంభించిపోయింది. చివరికి జాతీయ నాయకత్వం జోక్యం చేసుకుని, అందరికీ ఆమోదయోగ్యుడైన నేతగా ఎన్. రాంచందర్ రావుకు బాధ్యతలు అప్పగించింది. అయితే, ఈ మార్పు పార్టీలో శాంతిని నెలకొల్పలేకపోయింది. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా, పార్టీ కీలక నేత రాజాసింగ్ బీజేపీకి గుడ్ బై చెప్పడం పెద్ద కుదుపుకు గురిచేసింది. సారథి మారినా, రథం మాత్రం పాత బాటలోనే సాగుతూ గమ్యం వైపు వెళ్లలేక ఇబ్బంది పడుతుంది.
తెలంగాణ కమలదళంలో ఎంపీల మధ్య ఉన్న విభేదాలు ఈ ఏడాది పరాకాష్టకు చేరుకున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వర్గాల మధ్య కోల్డ్ వార్ బహిరంగ చర్చకు దారితీసింది. పార్టీలో ఎవరి హవా నడవాలనే విషయంలో మొదలైన ఈ పోటీ, పరస్పర ఫిర్యాదుల వరకు వెళ్లి అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే స్వయంగా జోక్యం చేసుకుని, పార్లమెంట్ సమావేశాల వేళ తెలంగాణ ఎంపీలకు రెండుసార్లు గట్టిగా క్లాస్ తీసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధినాయకత్వం హెచ్చరించినా, గ్రౌండ్ లెవల్‌లో గ్రూపు రాజకీయాలు తగ్గలేదు. దీనివల్ల ఇతర పార్టీల నుండి రావాలనుకునే నేతలు కూడా బీజేపీలో చేరడానికి వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read..| 2025 తెలంగాణ కాంగ్రెస్ కు కలిసొచ్చిందా.. ?
అంతర్గత కలహాల ప్రభావం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో స్పష్టంగా ప్రతిబింబించింది. అభ్యర్థి ఎంపికలో జాప్యం, నేతల మధ్య సమన్వయ లోపం కారణంగా కమలం పార్టీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ పరిధిలోనే ఈ ఓటమి ఎదురుకావడం కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాత్రం ఈ ఓటమిని భిన్నంగా విశ్లేషిస్తున్నారు. జూబ్లీహిల్స్ తమ బలమైన స్థానం కాదని, అక్కడ బీఆర్ఎస్ ఓడిపోవడమే తమకు సానుకూల అంశమని ఆయన వాదిస్తున్నారు. అంతేకాకుండా, ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడం పార్టీ ఎదుగుదలకు నిదర్శనమని ఆయన చెప్పుకొస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల ఫలితాలు కమళనాధలకు కొంత ఊరటనిచ్చినప్పటికీ, త్వరలో జరుగబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు బీజేపీకి అగ్నిపరీక్షగా మారనున్నాయి. పార్టీలోని ‘ఈగో’లను పక్కన పెట్టి, నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడంలో హైకమాండ్ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లుగా నేతలు వ్యవహరిస్తే, వచ్చే సాధారణ ఎన్నికల నాటికి పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. మరి ఈ పంచాయితీకి ఢిల్లీ పెద్దలు ఎలాంటి పరిష్కారం చూపుతారు ? తెలంగాణలో కాషాయ జెండాను రెపరెపలాడించడానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తారు? 2026 సంంత్సరం అయనా కమలం పార్టీకి కలిసి వస్తుందా.. లేదా.. అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.









