Menu

telangana gaddapara politics

తెలంగాణలో ‘గడ్డపార’ పాలిటిక్స్ నడుస్తున్నాయా ?

తెలంగాణలో ప్రస్తుతం గడ్డపార పాలిటిక్స్ నడుస్తున్నాయా..? రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడ చూసినా గడ్డపార గురించి రాజకీయ పార్టీల్లో విమర్శలు, ప్రతివిమర్శలు నడుస్తున్నాయి. తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు మొదలుకొని, మూసీ పునరుద్ధరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్, ఖమ్మంలో ఇండ్ల కూల్చివేతల వరకు.. రేవంత్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్యులకు శాపంగా మారాయా? రాబోయే జీహెచ్‌ఎంసీ, పరిషత్ ఎన్నికల వేళ బీజేపీ ఈ గడ్డపార నినాదాన్ని తన రాజకీయ ఆయుధంగా మార్చుకుందా? అసలు ఈ గడ్డపార విమర్శల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి?

తెలంగాణలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వ్యవస్థ ‘హైడ్రా’. చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు ధ్యేయంగా సీనియర్ అధికారి రంగనాథ్ నేతృత్వంలో ఈ విభాగం బుల్డోజర్లతో విరుచుకుపడింది. అయితే, ఆరంభంలో అక్రమ కట్టడాలపై సాగిన ఈ యుద్ధం, మెల్లమెల్లగా సామాన్యుల గూడు వరకు చేరడంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. బడా నేతలు, వ్యాపారవేత్తల జోలికి వెళ్లకుండా కేవలం పేదల ఇళ్లను టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే తరుణంలో ప్రభుత్వం ఇరకాటంలో పడటాన్ని గమనించిన ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీజేపీ.. హైడ్రా చర్యలను ప్రజా వ్యతిరేక విధానాలుగా ముద్రవేస్తూ క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంపై ఫోకస్ పెట్టింది.

హైడ్రా సృష్టించిన ప్రకంపనలు తగ్గకముందే.. మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు రూపంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. మూసా – ఈసా నదుల సంగమ ప్రాంతంలో సుమారు 5 వేల కోట్లతో ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టును నిర్మించి, అక్కడ భారీ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 450కి పైగా నివాసాలను, అపార్ట్‌మెంట్లను తొలగించేందుకు నోటీసులు జారీ చేయడం బాధితుల్లో ఆందోళన నింపింది. “మూసీ గోస – బీజేపీ భరోసా” పేరుతో రంగంలోకి దిగిన కమలనాథులు, ఈ కూల్చివేతలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విగ్రహాల కోసం ఇండ్లను కూల్చడం ఏ రకమైన అభివృద్ధి అంటూ బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు.

Also Read..| బీజేపీలోకి రాజాసింగ్ రీఎంట్రీ ఇక లాంఛనమేనా..?

ఇటీవల ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల ఇళ్ల కూల్చివేత బాధితులను పరామర్శించిన రాంచందర్ రావు, రేవంత్ రెడ్డి పాలనను “గడ్డపార రాజ్యం” అని అభివర్ణించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా చేతుల్లో గడ్డ పారలు పట్టుకుని రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇది ప్రజాస్వామ్య పాలన కాదు, కేవలం కూల్చివేతలే అజెండాగా సాగుతున్న తుగ్లక్ పాలన అని విమర్శలు గుప్పించారు. పేద ప్రజల కన్నీళ్లపై కట్టే కట్టడాలు ఎవరి ప్రయోజనం కోసమని బీజేపీ ప్రశ్నిస్తోంది. బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి పాలనను “గడ్డపార పాలన” అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంపీ రఘునందన్ రావు లాంటి నేతలు, అక్రమ కట్టడాల విషయంలో ప్రభుత్వం ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తోందని ఫైర్ అవుతున్నారు.

ముంచుకొస్తున్న జీహెచ్‌ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేళ బీజేపీ ఈ కూల్చివేతల అంశాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కూల్చివేతలపై ఉన్న శ్రద్ధను ప్రజా సమస్యలపై చూపడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది. రైతు భరోసా, నిరుద్యోగ భృతి, మహిళలకు ఇచ్చిన మహాలక్ష్మి గ్యారెంటీలు, ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల వంటి కీలక హామీలను పక్కనబెట్టి, కేవలం “దోచుకోవడం-దాచుకోవడం” అనే అజెండాతోనే సాగుతున్నారని విమర్శిస్తోంది. రాష్ట్ర సంపదను పక్కదారి పట్టించి, ఇతర రాష్ట్రాల ఎన్నికలకు మూటలు పంపుతున్నారని, అందుకోసమే ఈ కూల్చివేతల మాటున భారీ ప్రాజెక్టుల డ్రామా ఆడుతున్నారని బీజేపీ రాజకీయ విమర్శలకు పదును పెట్టింది.

గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరిట పేదల ఇళ్లు కూల్చేకంటే, అక్రమంగా నిర్మించిన విద్యాసంస్థలు, బడా వ్యాపారవేత్తల కట్టడాల స్థలంలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు సవాల్ విసురుతున్నారు. “అభివృద్ధి అంటే కూల్చడం కాదు.. పేదలకు నీడ కల్పించడం” అంటూ సరికొత్త నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం నగరాన్ని విశ్వనగరంగా మారుస్తామని చెబుతుంటే, మరోవైపు ఇళ్లను కోల్పోయి రోడ్డున పడుతున్న బాధితుల ఆక్రందనలు కాంగ్రెస్‌కు మైనస్‌గా మారే అవకాశం ఉందనే చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకునేందుకు బీజేపీ ‘గడ్డపార’ నినాదంతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

మొత్తానికి తెలంగాణలో “గడ్డపార రాజకీయం” పీక్ స్టేజ్‌కి చేరుకుంది. ఒకప్పుడు బుల్డోజర్ల గురించి యూపీలో వినేవాళ్లం, ఇప్పుడు గడ్డపారల గురించి తెలంగాణలో చర్చించుకోవాల్సి వస్తోంది. మరి, బీజేపీ చేస్తున్న ఈ ‘గడ్డపార’ ఆరోపణలకు రేవంత్ సర్కార్ తన పనితీరుతో సమాధానం చెబుతుందా? లేక ఈ విమర్శలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకును దెబ్బతీస్తాయా? బాధితుల పక్షాన నిలబడతామంటున్న కమలనాథుల పోరాటం ఏ తీరానికి చేరుతుందో తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే.

Share the post